Howrah Violence:


హౌరాలో ఘటన..


శ్రీరామ నవమి వేడుకల్లో పలు రాష్ట్రాల్లో హింస చెలరేగింది. గ్రూపుల గొడవలతో చాలా మంది గాయపడ్డారు. శాంతి భద్రతలు అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘర్షణలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ గొడవలు రాజకీయ మలుపు తిరిగాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జరిగిన అల్లర్లపై టీఎమ్‌సీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి...ఈ కేసు CID చేతికి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. వెంటనే సీఐడీ విచారణ జరపాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. గొడవ జరిగిన ప్రాంతంలో భద్రతనూ కట్టుదిట్టం చేశారు. CIDతో పాటు మరి కొన్ని స్పెషల్ బ్రాంచ్‌లు ఈ కేసుపై  పూర్తి స్థాయి విచారణ జరపనున్నాయి. DIG స్థాయి అధికారులు ఈ విచారణలో కీలక పాత్ర పోషించనున్నారు. అయితే...అసలు ఈ అల్లర్లకు కారణంగా తృణమూల్ కాంగ్రెస్ అని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనా అసహనం వ్యక్తం చేస్తోంది. హిందూ వర్గాన్ని కావాలనే టార్గెట్ చేసుకుంటున్నారని మండి పడుతోంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ...దీదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు రువ్విన వారికి క్లీన్ చిట్ ఇవ్వడమేంటంటూ ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఇంకెన్నాళ్లు ఇలా హిందూ వర్గాన్ని టార్గెట్ చేస్తారని అసహనం వ్యక్తం చేశారు. 


బీజేపీ నేతల డిమాండ్‌..


మరో బీజేపీ నేత సువేందు అధికారి కూడా దీదీపై మండి పడ్డారు. ఈ అల్లర్లపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతే కాదు. ఈ గొడవలో విదేశీ కుట్ర ఉందని ఆరోపించారు. బెంగాల్‌లో శాంతి భద్రతలు తీవ్రంగా విఫలమయ్యాయని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. NIA విచారణ జరిపించాలని కోరారు. ఈ కుట్ర వెనకాల ఎవరు ఉన్నా వదిలిపెట్టకూడదని డిమాండ్ చేశారు. కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవల్నీ బంద్ చేశారు.