జమ్ముకశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. కథువాలోని రంజిత్ సాగర్ డ్యామ్ వద్ద ఓ హెలికాప్టర్ క్రాష్ అయింది. అయితే ఇది ఆర్మీకి చెందిన హెలికాప్టర్ గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే భద్రతా దళాలు ఘటనా స్థలానికి పయనమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపడుతుంది.
ALSO READ:
Bandipora Encounter: జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఇద్దరు గల్లంతు..
ప్రమాదం జరిగే సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నట్లు సమాచారం. సాధారణ శిక్షణ నిమిత్తం హెలికాప్టర్ బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారుల ఆచూకీ గల్లంతైంది. లెఫ్టినెంట్ కల్నల్ ఏఎస్ భట్, కెప్టెన్ జయంత్ జోషి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఈ డ్యామ్ పంజాబ్ పఠాన్ కోట్ కు 30 కిమీ దూరంలో ఉంది.
254 ఆర్మీ ఏవిషేయన్ స్కాండ్రన్ కు చెందిన ఈ హెలికాప్టర్ పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి 10.20 కి బయలుదేరగా కథువా వద్ద ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో హెలికాప్టర్ డ్యామ్ లో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ALSO READ:
CBSE 10th Result 2021 LIVE Updates: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల..
కథువాలో రెండో ప్రమాదం..
జమ్ముకశ్మీర్ కథువాలో ఈ ఏడాది జనవరిలో కూడా ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెచ్ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్ కథవా జిల్లా లఖనాపుర్ లోని బషోలి బ్రిగేడ్ కేంద్రం వద్ద క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో లెఫ్టినెంట్ కల్నల్ రిషభ్ శర్మ గాయాలపాలై మృతి చెందారు. కెప్టెన్ అంజనీ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఘటన మరువకముందే నేడు ఇంకో ప్రమాదం జరిగింది.