అమరరాజా బ్యాటరీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోతోందని మీడియాలో.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ సంస్థ ఇంత వరకూ అధికారిక ప్రకటన చేయలేదు. అసలు ఈ ప్రచారంలో వాస్తవం ఏంటి అన్నదాన్ని "ఏబీపీ దేశం" పరిశీలించినప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమరరాజా బ్యాటరీస్ సంస్థ చిత్తూరు నుంచి తమ ప్లాంట్లను తరలించడం లేదు అనేది చాలా స్పష్టంగా ఉంది. కొత్తగా పెట్టాలనుకుంటున్న ప్లాంట్ల విషయంలోనూ ఆ సంస్థకు స్పష్టత ఉంది. కానీ.. ఈ ప్రచారం విషయంలో మాత్రం వ్యూహాత్మకంగానే గుంభనం పాటిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


చిత్తూరులో లిథియం ఆయాన్ బ్యాటరీల ఉత్పత్తి 


చిత్తూరు జిల్లాలో అతి పెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటి అమరరాజా బ్యాటరీస్. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే "అమరాన్" బ్రాండ్ బ్యాటరీస్‌ను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. చిత్తూరు జిల్లాకే చెందిన గల్లా రామచంద్రనాయుడు దీనికి నిన్నామొన్నటిదాకా చైర్మన్‌గా ఉండేవారు. ఇప్పుడు గల్లా రామచంద్రనాయుడు కుమారుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చైర్మన్ అయ్యారు. సొంత గడ్డపై ప్రజలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో.. అమరరాజా సంస్థ దేశంలో మరెక్కడా ప్లాంట్లు నిర్మించలేదు.  చిత్తూరులోనే పెట్టింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి అడుగుపెట్టినా... ప్లాంట్లను చిత్తూరు జిల్లాలోనే కేంద్రీకరించింది. ఇప్పుడు కొత్తగా లిథియం ఆయాన్ బ్యాటరీలను ఉత్పత్తి చేయాలనే ప్రణాళికలు వేసుకుంటోంది. 


ఇప్పుడు తమిళనాడుకు వెళ్తున్నట్లు ప్రచారం.. ఖండించని అమరరాజా..! 


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికిల్  ట్రెండ్ నడుస్తోంది. ఈ కారణంగా మామూలు బ్యాటరీల కన్నా లిథియం ఆయాన్ బ్యాటరీకే ఎక్కువ డిమాండ్ వస్తుందన్నఅంచనాతో ముందస్తుగా ఆ రంగంలో ప్రవేశించడానికి ఏర్పాట్లు చేసుకుంది.  ఫిబ్రవరిలో ఈ ప్లాంట్‌ను తిరుపతిలోనే పెట్టబోతున్నట్లుగా ప్రణాళికలు మీడియాకు వెల్లడించారు. లిథియం ఆయాన్ బ్యాటరీలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో నుంచి తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు.. ఆ ప్లాంట్ తమిళనాడులో పెట్టబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దీన్ని అమరరాజా బ్యాటరీస్ ఖండించడం లేదు. 


వేధిస్తే వెళ్లిపోతామని ప్రభుత్వానికి సంకేతాలు పంపుతున్నారా..!?


అమరరాజా బ్యాటరీస్ సంస్థకు ఉన్నత ప్రమాణాలు పాటించే సంస్థగా పేరుంది. అయితే ఇటీవల ఆ సంస్థ ప్రభుత్వం నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మొదట భూమి కేటాయింపును రద్దు చేశారు. తర్వాత కాలుష్యం పేరు చెప్పి ఫ్యాక్టరీలను మూత వేయించేందుకు ప్రయత్నించారు. అమరరాజా కోర్టుకు వెళ్లి కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఈ కారణంగా  పరిశ్రమలన్నీ ఒకే చోట ఉంచడం వల్ల... రాజకీయ సవాళ్లు ఎదురయినప్పుడు.. ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని.. వికేంద్రీకరణ చేయాలని కొత్త చైర్మన్ నేతృత్వంలో సంస్థ ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతోనే అమరరాజా వెళ్లిపోతోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే వెళ్తే .. విస్తరణ ప్లాంట్లు వెళ్తాయి కానీ ప్రధాన ప్లాంట్ కాదని అంటున్నారు. దీనిపై సంస్థ అధికారిక ప్రకటన చేస్తేనే కానీ స్పష్టత రాదు. అయితే ప్రభుత్వం వేధింపులను ఆపకపోతే.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతామన్న సంకేతాలను ఈ సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం ద్వారా.. ప్రభుత్వానికి అమరరాజా ఇస్తోందన్న అభిప్రాయం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.