Youtuber Spying For Pakistan | అమృత్‌సర్: భారతదేశంలో గత కొన్ని రోజులుగా వరుసగా యూట్యూబర్లు అరెస్ట్ అవుతున్నారు. పంజాబ్ లోని రూపనగర్ లో పోలీసులు మరో యూట్యూబర్‌ జస్బీర్ సింగ్ (YouTuber Jasbir Singh) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌కు నిఘా వ్యవహారాలకు సంబంధించి సమాచారం అందిస్తున్నాడన్న ఆరోపణలతో అతడ్ని అరెస్ట్ చేశారు. జస్బీర్ సింగ్ ‘జాన్ మహల్’ అనే యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నాడు. పాక్‌లో పర్యటించి మరీ భారత్ గురించి సీక్రెట్ సమాచారం ఐఎస్ఐ (ISI) ఏజెంట్లకు చేరవేసిన జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)తో కూడా తాజాగా అరెస్ట్ అయిన యూట్యూబర్ కు లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 


మూడుసార్లు పాక్‌లో పర్యటించిన జస్బీర్ సింగ్


జస్వీర్ సింగ్ పాకిస్తాన్ రహస్య సంస్థ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ISI) షాకిర్ తో సంబంధాలు కలిగి ఉన్నాడు. అతడు గత ఏడాది, అంతకుముందు మరో రెండుసార్లు మొత్తం మూడు పర్యాయాలు పాకిస్తాన్ వెళ్ళాడు. అతనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా పాకిస్తాన్‌కు చెందిన అనేక నంబర్లను పోలీసులు గుర్తించారు. పాక్ దౌత్య అధికారి దానిష్ ఆహ్వానం మేరకు జస్వీర్ సింగ్ ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో జరిగిన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాడని సమాచారం.


వరుస యూట్యూబర్లు అరెస్ట్


భారత్‌లో వరుసగా యూట్యూబర్లు అరెస్ట్ అవుతున్నారు. హర్యానాకు చెందిన ఫేమస్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మొదట అరెస్ట్ అయింది. ఆమె నేరుగా పాక్ దౌత్య అధికారులతో సమావేశం కావడం, వారు ఆమెకు పాక్ పర్యటనలో విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తేలింది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన బయ్యా సన్నీ యాదవ్ (సందీప్ యాదవ్) పాక్ లో పర్యటించడం, గూఢచర్యం అభియోగాలతో అరెస్ట్ కాగా, నేడు జస్బీర్ సింగ్ అనే మరో యూట్యూబర్ సైతం నిఘా వ్యవహారంలో అరెస్ట్ అయ్యాడు. దాంతో భద్రతా ఏజెన్సీలు యూట్యూబర్లపై నిఘా పెట్టాయి.

 

నిఘాపెంచిన దర్యాప్తు సంస్థలు

ఆపరేషన్ సింధూర్ అనంతరం గూఢచర్యం ఆరోపణలు తెరపైకి రావడంతో.. గత కొంతకాలం నుంచి పాకిస్తాన్‌లో పర్యటించిన యూట్యూబర్లపై దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ఈ క్రమంలో మొహాలీలోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (SSOC) నిఘా సమాచారం ఆధారంగా రూప్‌నగర్ జిల్లా మహ్లాన్ గ్రామానికి చెందిన జస్బిర్ సింగ్‌న  అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జస్బీర్ సింగ్ 2020, 2021, 2024లో పాకిస్తాన్‌లో పర్యటించాడు. పాక్ అధికారి డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ వేడుకలకు సైతం జస్బీర్ హాజరైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

యూట్యూబర్ జస్బీర్ సింగ్ పాకిస్తాన్ ఏజెంట్ జుట్ రాంధావా అలియాస్ షకీర్ అలియాస్ తో పరిచయం ఉంది. షకీల్ ఎవరంటే.. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం పనిచేస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తి. జస్బిర్ సింగ్ "జాన్ మహల్" పేరుతో యూట్యూబ్ చానల్ రన్ చేస్తుండగా.. 1 మిలియన్ పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు.

నిన్న రాజస్థాన్ మాజీ మంత్రి పీఏను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లో మరో వ్యక్తిని సైతం పాక్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా భావించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అంతర్గత శత్రువులతోనే దేశానికి నష్టం వాటిల్లుతుందన్న భయాందోళన పెరుగుతోంది.