Yamuna Water Level: యమునా నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో యమునమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్ మహల్ గోడ వరకు వరద నీరు చేరుకుంది. 45 ఏళ్ల తర్వాత తొలిసారి యమున ప్రవాహం తాజ్ మహల్ కట్టడం గోడను తాకుతూ ప్రవహిస్తోంది. తాజ్ మహల్ ముందు ఉన్న గార్డెన్ లోకి వరద నీరు చేరుకుంది. తాజ్ మహల్ వద్ద యమునా నది గరిష్ఠ నీటి మట్టం 495 అడుగులు కాగా.. ప్రస్తుతం వరద ప్రవాహం 497.9 అడుగులను దాటింది. చివరి సారిగా 1978 నాటి వరదల సమయంలో యమునా నది ఉద్ధృతంగా ప్రవహించింది. అప్పుడు మొదటిసారి యమున ప్రవాహం  తాజ్ మహల్ వెనక గోడను తాకిందని కన్జర్వేషన్ అసిస్టెంట్ ప్రిన్స్ వాజ్‌పేయి తెలిపారు. 


మరింత ఉద్ధృతి పెరిగిన తాజ్‌మహల్‌కు ముప్పు లేదు


యమునా నది ఉద్ధృతి మరింత పెరిగినప్పటికీ.. తాజ్ మహల్ కు ముప్పేమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎంత ఉద్ధృతితో యమునా ప్రవహించినప్పటికీ.. తాజ్ మహల్ ప్రధాన సమాధిలోకి నీరు ప్రవేశించని విధంగా ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ వారసత్వ కట్టడానికి వరదల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు. 1978 నాటి వరదల సమయంలో యమునా నది గరిష్ఠంగా 508 అడుగుల మేర ప్రవహించింది. అప్పుడు తాజ్ మహల్ స్మారకంలోని నేలమాళిగల్లోని 22 గదుల్లోకి వరద నీరు చేరింది. ఈ ఘటన తర్వాత అధికారులు చెక్క తలుపులను తొలగించారు.