Brij Bhushan Singh Gets Interim Bail: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు కోర్టులో ఊరట లభించింది. WFI ఉపకార్యదర్శి వినోద్ తోమర్, బ్రిజ్ భూషన్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రూ.25 వేల పూచికత్తుపై రెండు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ గురువారం జరగనుంది. అప్పటి వరకు బ్రిజ్ భూషణ్‌తో పాటు WFI ఉపకార్యదర్శి వినోద్ తోమర్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యాహ్నం రెండు గంటలకు బ్రిజ్ భూషణ్ నేరుగా న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. బ్రిజ్ భూషణ్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. బ్రిజ్ భూషణ్ నిర్దోషి అని, అతనిపై దాఖలైన ఛార్జిషీటు పూర్తిగా అబద్ధాలతో కూడుకున్నదని, ఇది రాజకీయ కుట్రలో భాగమని అన్నారు.
లైంగిక వేధింపుల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్‌పై ఆరు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 180 మందిని విచారణ జరిపి ఛార్జిషీట్ తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో గత వారం ఢిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్‌కు సమన్లు జారీ చేసింది. కేసును విచారించడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. మంగళవారం కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బ్రిజ్‌భూషన్ కోర్టుకు హాజరై.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వాదనలు విన్న న్యాయస్థానం బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌కు రెండు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అసలేం జరిగిందంటే..
WFI చీఫ్ బ్రిజ్‌భూషణ్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ.. వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ సహా పలువురు మహిళా రెజ్లర్లు జనవరిలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు చేపట్టారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగ్రహించిన సుప్రీంకోర్టు నిందితులపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపులతోపాటు, పొక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత లైంగిక ఆరోపణలు చేసిన మైనర్ బాలిక ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో పొక్సో కేసును తొలగించారు.
రెజ్లర్ల ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా దాదాపు 1,599 పేజీల భారీ చార్జిషీటును దాఖలు చేశారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం మేరకు.. రెజ్లర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బ్రిజ్ భూషణ్ సింగ్ విచారణ, శిక్షార్హుడుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. నిందితులకు సమన్లు జారీ చేసింది. మంగళవారం కోర్టుకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్రిజ్ భూషణ్‌తోపాటు వినోద్ తోమర్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జూలై 20న విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయకుండా బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial