ఈమధ్య మన టాలీవుడ్ లో ఓ సరికొత్త ట్రెండ్ షురూ అయింది. అదే 'స్పెషల్ ప్రీమియర్ ట్రెండ్'. ఇప్పటివరకు ఈ ట్రెండ్ ఫాలో అయిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. తాజాగా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎమోషనల్ లవ్ స్టోరీ 'బేబీ' ఇదే ట్రెండ్ ఫాలో అయి ఇప్పుడు థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. 'బేబీ' మూవీ జూలై 14న విడుదలవగా దానికి ఒక్కరోజు ముందు అంటే జూలై 13న హైదరాబాదులోని పలు థియేటర్స్ లో స్పెషల్ ప్రీమియర్స్ ని ప్రదర్శించారు. ఇక స్పెషల్ ప్రీమియర్స్ తోనే ఈ సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చేసింది. దీంతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. దీనికంటే ముందు సుహాస్ నటించిన 'రైటర్ పద్మభూషణం' కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అయి సక్సెస్ అయింది.


ఇక ఇప్పుడు ఈ స్పెషల్ ప్రీమియర్ ట్రెండ్ లో మరో సినిమా కూడా చేరింది. ఆ సినిమా పేరే 'హిడింబ'. ప్రముఖ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జూలై 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఇక సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి మేకర్స్ మరో ముందడుగు వేశారు. తమ సినిమాపై ఉన్న నమ్మకంతో లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న స్పెషల్ ప్రీమియర్ షోస్ ని తెలుగు స్టేట్స్ లో పలుచోట్ల ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ మేరకు మూవీ యూనిట్ జూలై 18 న 'హిడింబ' స్పెషల్ ప్రీమియర్స్ ని ప్రదర్శించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. హైదరాబాద్ తో పాటు సుమారు తెలుగు రాష్ట్రాల్లోని 6 నగరాల్లో 'హిడింబ' స్పెషల్ ప్రీమియర్స్ షోలను ప్రదర్శిస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.


అంతే కాదు తెలుగు స్టేట్స్ లో జులై 18(ఈరోజు) సాయంత్రం ఏడు గంటల నుంచి స్పెషల్ ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా మూవీ టీం రిలీజ్ కు ముందే ఇలాంటి ముందడుగు వేయడం సినిమా కంటెంట్ పై మూవీ టీమ్ కి ఉన్న నమ్మకాన్ని చూపుతుందని చెప్పవచ్చు. మరి ఈ స్పెషల్ ప్రీమియర్ ట్రెండ్ 'హిడింబ' మూవీ టీమ్ కి కలిసొచ్చి వాళ్లకు సక్సెస్ అందిస్తుందేమో చూడాలి. ఇక 'హిడింబ' సినిమా విషయానికొస్తే.. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అశ్విన్ బాబు సరసన నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తోంది.


శ్రీ విగ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ పై శ్రీధర్ గంగపట్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వికాస్ బడిసా సంగీతమందించారు. ప్రమోదిని, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, రఘు కుంచే, మకరంద్ దేశ్పాండే, శుభలేఖ సుధాకర్, ఛత్రపతి శేఖర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మిస్టరీ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాతో హీరో అశ్విన్ బాబు ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. మరి చాలా గ్యాప్ తర్వాత 'హిడింబ' సినిమాతో వస్తున్న అశ్విన్ బాబుకి ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.