Yamuna Floods: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. నగరంలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద 206.42 మీటర్ల ఎత్తులో ఉరకలు వేస్తోంది. ఆదివారంతో పోలిస్తే నీటిమట్టం స్థాయి కాస్త ఎక్కువగానే ఉంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజీ నుంచి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఈక్రమంలోనే ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించింది. ఓల్డ్ యమునా బ్రిడ్జ్ సమీపంలో నది డేంజర్ మార్కు దాటడంతో తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీ నుంచి షహదారా మధ్య రాకపోకలు సాగించే రైళ్లను కూడా రద్దే చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. 










మరోవైపు నిండుకుండల్లా మారిన తెలంగాణ ప్రాజెక్టులు


తెలంగాణతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుగా మారాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా పరీవాహక ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆలమట్టిలోకి లక్షా 7 వేల 769 క్యూసెక్కులు ప్రవాహం ఉండగా... నీటిమట్టం 54.56 టీఎంసీలకు చేరుకుంది. 6,671 క్యూసెక్కులు దిగువకు విడుదల అవుతున్నాయి. జూరాలకు 41,925 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ప్రాజెక్టులో పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ఆదివారం రోజు 8.75 టీఎంసీల నీటిమట్టం ఉంది. 8,904 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ కు 5,081 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 17.80 టీఎంసీలకు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకూ వరద ప్రవాహాలు పెరిగాయి. శ్రీరామ సాగర్ ప్రాజెక్టుకు లక్షా 21 వేల 8 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... 882 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను 6.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.


నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 48,475 క్యూసెక్కులు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 22,440 క్యూసెక్కుల వరద వస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 5,917 క్యూసెక్కుల వరద వస్తుండగా 385 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.04 టీఎంసీలకు చేరుకుంది. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీకి 5,49,210 క్యూసెక్కుల వరద వస్తుండగా... 5.49 లక్షల క్యూసెక్కుల నీటిని 75 గేట్ల ద్వారా వదులుతున్నారు.  ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఆదివారం రోజు ఎగువ, దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగించారు. ఎగువన ఐదు, దిగువన నాలుగు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేశారు. సాయంత్రానికి ఎగువన 175 మెగావాట్లు ఉత్పత్తి చేయగా.. దిగువన 145 మెగావాట్లు ఉత్పత్తి చేసినట్లు జెన్ కో ఎస్ఈ రామ సుబ్బారెడ్డి తెలిపారు.