Wrestlers Protest: 


అనురాగ్ ఠాకూర్‌తో భేటీ 


కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా, సాక్షిమాలిక్ భేటీ అయ్యారు. తమ డిమాండ్‌లనూ వినిపించారు. మొత్తం 4 డిమాండ్‌లు వినిపించిన రెజ్లర్లు...రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)కి మహిళా చీఫ్‌ని నియమించాలని కోరారు. తమపై పోలీసులు నమోదు చేసిన FIRలను విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్‌పై విచారణ జరిపి ఆయనను అరెస్ట్ చేయాలని తేల్చి చెప్పారు. ఓ మైనర్ రెజ్లర్‌ని కూడా ఆయన లైంగికంగా వేధించారని ఆరోపించారు రెజ్లర్లు. అంతే కాదు. రెజ్లింగ్ ఫెడరేషన్‌లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని, మహిళను చీఫ్‌గా నియమిస్తే సమస్యలు తీరిపోతాయని అనురాగ్ ఠాకూర్‌కి వివరించినట్టు తెలుస్తోంది. ఇకపై రెజ్లింగ్ ఫెడరేషన్ విషయంలో బ్రిజ్ భూషణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులెవరూ జోక్యం చేసుకోకూడదని డిమాండ్ చేసినట్టు సమాచారం. కచ్చితంగా ఆయనను అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుపట్టారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే...ఈ డిమాండ్‌లన్నీ తీర్చడం కేంద్రానికి సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే...రెజ్లింగ్ ఫెడరేషన్‌ అనేది ఓ స్వతంత్ర సంస్థ. అందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోడానికి అవకాశముండదు. కానీ...ఆ సంస్థ రాజ్యాంగాన్ని మార్చేసి జోక్యం చేసుకుంటే మాత్రం రెజ్లర్ల డిమాండ్‌లు తీర్చేందుకు వీలుంటుంది. 


అమిత్‌షాతోనూ భేటీ..


ఇటీవలే రెజ్లర్లు కేంద్రహోం మంత్రి అమిత్‌షాని కలిశారు. అక్కడా ఇవే డిమాండ్‌లు వినిపించారు. ఆ తరవాతే బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్ తమతమ ఉద్యోగాల్లో చేరారు. అయితే..తమ ఉద్యమం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరిలోనూ అనురాగ్‌ ఠాకూర్‌తో భేటీ అయ్యారు రెజ్లర్లు. "కమిటీ వేస్తాం" అని హామీ ఇవ్వడం వల్ల వెంటనే ఆ ఆందోళనలను ఉపసంహరించుకున్నారు. ఆ కమిటీతోనూ లాభం లేదని భావించి...మరోసారి జంతర్‌మంతర్ వద్ద నిరసనలు మొదలు పెట్టారు. దాదాపు నెల రోజులుగా ఇవి కొనసాగుతున్నాయి. తమ ఆందోళనలపై వెనక్కి తగ్గే విషయంలో అందరం ఒకే నిర్ణయంపై ఉంటామని గతంలోనే తేల్చి చెప్పారు సాక్షి మాలిక్. అందరికీ ఆమోదం అనిపించే హామీలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగితే అప్పుడే ఆందోళనలు విరమిస్తామని అన్నారు. 


రెజ్లర్ సాక్షి మాలిక్ ఆందోళనను ఉపసంహరించు కుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమెతో పాటు బజ్‌రంగ్ పునియా కూడా వెనక్కి తగ్గినట్టు ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇవన్నీ తప్పుడు వార్తలని తేల్చి చెప్పింది సాక్షి మాలిక్. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకూడదని రిక్వెస్ట్ చేసింది. న్యాయం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో వెనక్కి తగ్గం అని స్పష్టం చేసింది. ఉద్యోగం చేసుకుంటూనే ఉద్యమం కొనసాగిస్తానని వెల్లడించింది. 


"ఇవన్నీ తప్పుడు వార్తలు. న్యాయంకోసం మేం చేసే పోరాటంలో ఎప్పటికీ వెనక్కి తగ్గలేదు. తగ్గం కూడా. ఈ నిరసనలు కొనసాగిస్తూనే...రైల్వేలో నా డ్యూటీ నేను చేస్తున్నాను. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. దయచేసి వదంతులు వ్యాప్తి చేయొద్దు"


- సాక్షి మాలిక్, రెజ్లర్


Also Read: Cardiologist Death: 16 వేల హార్ట్ సర్జరీలు చేసిన కార్డియాలజిస్ట్‌కి గుండెపోటు, నిద్రలోనే మృతి