Gujarat Cardiologist Death: 


గౌరవ్ గాంధీ మృతి..


గుజరాత్‌లో ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ (Dr Gaurav Gandhi) గుండెపోటుతో మృతి చెందారు. జూన్ 6వ తేదీ తెల్లవారుజాము నిద్రలోనే గుండెపోటుతో చనిపోయారు. అత్యంత యువ కార్డియాలజిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆయన...గుండెపోటుతో చనిపోయారన్న వార్త అందరినీ షాక్‌కి గురి చేసింది. రోజూ లాగానే హాస్పిటల్‌కి వెళ్లి వచ్చి డిన్నర్ చేసి పడుకున్నారని, తెల్లారి ఎంతకీ నిద్ర లేకపోవడం వల్ల అనుమానం వచ్చి చూస్తే నిర్జీవంగా పడి ఉన్నారని పోలీస్‌లు వెల్లడించారు. అయితే...గుండెపోటుకి సంబంధించిన ఎలాంటి లక్షణాలు ఆయనలో కనిపించలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. కనీసం నొప్పిగా ఉందని కూడా ఏమీ చెప్పలేదని, ఉన్నట్టుండి గుండెపోటుతో నిద్రలోనే చనిపోవడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఉదయం 6 గంటలకు నిద్రలేస్తారు గౌరవ్. అప్పటికీ ఆయన లేవకపోవడం వల్ల కుటుంబ సభ్యులు వరుస పెట్టి కాల్స్ చేశారు. అయినా రెస్పాండ్ అవ్వలేదు. వెంటనే గదిలోకి వెళ్లారు. బెడ్‌పై అచేతనంగా పడి ఉన్న ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. 41 ఏళ్ల గౌరవ్ గాంధీ...తన కెరీర్‌లో 16 వేల హార్ట్ సర్జరీలు చేశారు. ఇప్పుడు ఆయనే హార్ట్ ఎటాక్‌తో కన్ను మూశారు. 


గుండెపోటుకి కారణాలివే..


గుండెపోటు రావడానికి ప్రధాన కారణం రక్తనాళాల్లో రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం జరిగితే  గుండె సరిగా రక్త సరఫరా చేయలేదు. దీనివల్ల గుండెపోటు వస్తుంది. ప్రపంచంలో గుండె జబ్బుల కారణంగా ప్రతి ఏటా 17 మిలియన్లకు పైగా వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఐదవ వంతు మమరణాలు సంభవిస్తున్నది మనదేశంలోనే. హృదయ సంబంధ వ్యాధులు అనేక రకాలుగా ఉంటాయి అధిక రక్తపోటు వల్ల కలిగేవి, అరిథ్మియా, హృదయ ధమణి వ్యాధి ఇలా రకరకాలుగా రక్తనాళాల్లో ఇబ్బందులను కలుగ చేసే జబ్బులు ఉన్నాయి. ఏదేమైనా చివరకు జరిగేది గుండెపోటు రావడమే. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. 


లక్షణాలు
1. ఛాతి నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. 
2. శ్వాస సరిగా ఆడదు.
3. చేయి లేదా భుజం నొప్పి వేధిస్తూ ఉంటుంది.
4. బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
 ఈ లక్షణాలు గుండెపోటు రావడానికి కొన్ని వారాలు లేదా రోజులు ముందు జరగవచ్చు. కొందరి విషయంలో గంటల ముందు కూడా ఇవి కనిపించే అవకాశం ఉంది. మెడ గట్టిగా పట్టేయడం, భుజం నొప్పి, అజీర్ణం, అలసట, చల్లని చెమటలు పట్టడం కూడా గుండెపోటు రాకకు ముందస్తు సంకేతాలే. 


గుండెపోటు పురుషుల కంటే మహిళల్లో ప్రాణాంతకంగా కనిపిస్తోంది. ఎందుకంటే స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చాక పురుషులు కోలుకోగలుగుతున్నారు కానీ మహిళలకు కోలుకోవడం సవాలుగా మారుతుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల కూడా గుండెపోటు రావచ్చు, అయితే ఇలా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం అనేది మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా ఉంది.


Also Read: సిసోడియాను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న కేజ్రీవాల్, మిస్ అవుతున్నానంటూ భావోద్వేగం