Delhi Liquor Policy Case: 


కేజ్రీవాల్ భావోద్వేగం..


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాను తాను చాలా మిస్ అవుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఓ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన కేజ్రీవాల్...ఢిల్లీలోని విద్యావ్యవస్థ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగానే మనీశ్ సిసోడియాను తలుచుకున్నారు. విద్యార్థులందరికీ మెరుగైన విద్య అందించడానికి సిసోడియా చాలా తపన పడ్డారని, ఆయన తన పక్కన లేకపోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లిక్కర్ స్కామ్‌ కేసులో సిసోడియా అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బెయిల్‌ కోసం పిటిషన్‌లు పెట్టుకున్నా...ఊరట లభించడం లేదు. కీలక ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నా..సిసోడియా సహకరించడం లేదని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్‌ ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు. అవన్నీ తప్పుడు ఆరోపణలే అని కొట్టి పారేస్తున్నారు. ఈ క్రమంలోనే స్కూల్ ఓపెనింగ్‌కి వెళ్లిన ఆయన...సిసోడియాను తలుచుకున్నారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 


"ఇవాళ సిసోడియా ఎందుకో బాగా గుర్తొస్తున్నారు. ఆయనపై తప్పుడు కేసులు పెట్టారు. అందరికీ మెరుగైన విద్య అందించాలన్నది ఆయన కల. కానీ ఆయననే టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన విద్యార్థుల గురించి ఆలోచించకుండా ఉండి ఉంటే ఇవాళ జైలుకెళ్లాల్సిన దుస్థితి రాకపోయేది. ఢిల్లీలో విద్యా ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. కానీ అది జరగనివ్వం."


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి