Viral Video: 


రాజస్థాన్‌లో ఘటన..


రాజస్థాన్‌లో ఓ యువకుడు అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఇంటి నుంచి ఆ అమ్మాయిని లాక్కెళ్లాడు. ఎడారికి తీసుకెళ్లి అక్కడే పుల్లలన్నీ ఏరుకొచ్చి మంట పెట్టాడు. అదే హోమం అనుకుని దాని చుట్టూ తిరిగాడు. ఆ అమ్మాయిని ఎత్తుకున్నాడు. ఆ అమ్మాయి "వద్దు" అని గట్టిగా ఏడుస్తున్నా వినలేదు. ఈ తంతునంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే వైరల్ అయిపోయింది. అప్పటి నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఆప్‌ నేత నరేశ్ బల్యాన్‌ ఈ వీడియోని పోస్ట్ చేశారు. "ఇప్పటి వరకూ ఎందుకు శిక్షించలేదు" అని విమర్శించారు. ఆప్‌ నేతలు చెబుతున్న వివరాల ప్రకారం...జైసల్మేర్‌లోని ఓ గ్రామానికి చెందిన బాలికను జూన్ 1వ తేదీన 15-20 మంది వచ్చి కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఎత్తుకెళ్లిపోయారు. "సీఎం అశోక్ గహ్లోట్ ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాల్సిందే" అని ఆప్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని విమర్శించింది. ఎన్నాళ్లు అమ్మాయిలు ఇలా భయపడుతూ బతకాలని ప్రశ్నించింది. అయితే...గహ్లోట్ ప్రభుత్వం ఇటీవలే ఓ నిర్ణయం తీసుకుంది. గత నెల దాదాపు అన్ని జిల్లాల్లో నాన్ వయలెన్స్ సెల్స్ (Non Violence Cells)ని ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని గహ్లోట్ వెల్లడించారు. ఆ తరవాతే ఈ ఘటన జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 






ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. DCW చీఫ్ స్వాతి మలివాల్ దీనిపై అసహనం వ్యక్తం చేశారు. చాలా షాకింగ్‌గా ఉందని మండి పడ్డారు. అందరూ చూస్తుండగానే కిడ్నాప్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"ఈ వీడియో చూడగానే షాక్‌కి గురయ్యాను. అందరూ చూస్తుండగానే ఆ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఎవరూ లేని ఎడారి ప్రాంతానికి తీసుకెల్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. అత్యంత దారుణమైన ఘటన ఇది. అశోక్ గహ్లోట్‌ జీ..దీనిపై విచారణ జరపండి"


- స్వాతి మలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్