Mamata Benerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 12 రోజుల దుబాయ్, స్పెయిన్ పర్యటనకు బయల్దేరిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం బెంగాల్ నుంచి బయల్దేరిన దీదీ.. సాయంత్రం దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో వివిధ వ్యాపార శిఖరాగ్ర సమావేశాలకు ఆమె హాజరు కానున్నారు. కాగా.. బుధవారం దుబాయ్ విమానాశ్రయంలో మమతా బెనర్జీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కలుసుకున్నారు. వారి మధ్య కాసేపు చర్చ జరిగింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి.. శ్రీలంక అధ్యక్షుడి నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు కలిసి I.N.D.I.A పేరుతో ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడుసార్లు ఈ కూటమి నేతలు సమావేశమయ్యారు. బీజేపీని ఎదుర్కొనే వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చోపచర్చలు సాగిస్తున్నారు. అయితే.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే.. మమత బెనర్జీకి ప్రతిపక్ష కూటమికి సంబంధించి ప్రశ్నించారు.


ప్రతిపక్ష కూటమి అయిన I.N.D.I.A కు మీరు నాయకత్వం వహిస్తారా అని శ్రీలంక అధ్యక్షుడు మమతా బెనర్జీని ప్రశ్నించారు. దానికి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ చిరునవ్వుతో సమాధానం చెప్పారు. ప్రజలు మద్దతు ఇస్తే భవిష్యత్తులో మనం అధికారంలో ఉండగలమని చెప్పుకొచ్చారు. 


శ్రీలంక అధ్యక్షుడిని దుబాయ్ విమానాశ్రయంలో కలుసుకున్నట్లు మమతా బెనర్జీ తన x (ట్విట్టర్) వేదికగా తన అకౌంట్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు. 'శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే.. నన్ను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లాంజ్ లో చూసి పలకరించారు. నవంబర్ లో కలకత్తాలో జరగనున్న బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2023 కి ఆయనను ఆహ్వానించాను. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కూడా తనను ద్వీప దేశాన్ని సందర్శించాల్సిందిగా కోరారు. నేను ఆయన ఆహ్వాన్ని ఎంతో వినమ్రంగా స్వీకరించాను' అని మమతా బెనర్జీ పోస్టు చేశారు. 


12 రోజుల పాటు దుబాయ్ లో, స్పెయిన్ లో పర్యటించినున్నారు మమతా బెనర్జీ. అయితే విమానంలో సాంకేతిక సమస్య వల్ల దీదీ 3 గంటల ఆలస్యంగా బయల్దేరారు. బెంగాల్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ, స్పెయిన్ లో వ్యాపార శిఖరాగ్ర సమావేశాలకు మమతా బెనర్జీ హాజరు కానున్నాయి. ఐదేళ్లలో తను చేస్తున్న మొదటి విదేశీ పర్యటన ఇదేనని మమతా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.


'నేను విదేశాలకు వెళ్లి 5 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం అంతర్జాతీయ కలకత్తా బుక్ ఫెయిర్ లో స్పెయిన్ థీమ్ దేశం. స్పెయిన్ దేశం తయారీ, ఇతర పరిశ్రమలలో ఉత్తమమైనది. అక్కడ జరగబోయే వ్యాపార సమావేశాల్లో పాల్గొంటాం' అని మమతా బెనర్జీ విమానాశ్రయంలో విలేకరులతో అన్నారు. 


'విదేశీ ప్రతినిధులు పదే పదే దేశానికి వస్తుంటారు. కానీ మేం వెళ్లడం లేదు. అందుకే ఇప్పుడు వెళ్తున్నాం. దుబాయ్ లో బిజినెస్ కాన్ఫరెన్స్ కూడా షెడ్యూల్ అయింది' అని దీదీ చెప్పారు.