సహజీవనం పేరుతో ఓ యువతిని మోసం చేసి ఆపై దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని పాల్‌గఢ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. చనిపోయిన యువతిని 28 ఏళ్ల నైనా మెహతాగా పోలీసులు గుర్తించారు. ఆమె సినిమా ఇండస్ట్రీలో మేకప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది.  43 ఏళ‌్ల మనోహర్ శుక్లా అనే వ్యక్తి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. మనోహర్‌, నైనాలు ఐదేళ్ల నుంచి కలిసి ఉంటున్నారు. శుక్లాకు వేరే మహిళతో అప్పటికే వివాహమైంది. కానీ నైనాతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నైనా ఇటీవల కొన్ని రోజుల నుంచి తనను పెళ్లి చేసుకోవాలని శుక్లాను ఒత్తిడి చేస్తోంది. అతడు అందుకు అంగీకరించడం లేదు. దీంతో ఆమె శుక్లాపై అత్యాచారం కేసు పెట్టింది. దీంతో ఆగ్రహించిన శుక్లా తనపై కేసు వెనక్కి తీసుకోవాలని ఆమెను బెదిరించాడు. ఆమె ఒప్పుకోకపోయే సరికి నైనాను హత్య చేశాడు అని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ పద్మజా బాడే తెలిపారు. అయితే శుక్లా భార్య కూడా నైనా శవాన్ని మాయం చేసేందుకు సహకరిచిందని పోలీసులు తెలిపారు.


నైనాను హత్య చేసిన తర్వాత శుక్లా ఆమె శవాన్ని మాయం చేసేందుకు భార్య సహాయం కోరాడు. దీంతో ఇద్దరూ కలిసి శవాన్ని సూట్‌కేస్‌లో కుక్కి గుజరాత్‌లోని వల్సాద్‌ వద్ద నీటిలో పడేశారు. ఈ ఘటన ఆగస్టు 9 అప్పుడు జరిగింది. కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 12న నైనా కుటుంబసభ్యులు ఆమె కనిపించడం లేదని నైగావ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నైనా సోదరి జయ పోలీసులకు కంప్లైంట్‌ చేశారు. నైనా కనిపించడం లేదని, ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ వస్తోందని పోలీసులకు తెలిపారు. అయితే వస్లాద్‌ వద్ద పోలీసులు శవాన్ని గుర్తించి యాక్సిడెంటల్‌ డెత్‌ రిపోర్ట్‌ నమోదు చేశారు. బాడీ క్లెయిమ్‌ చేసుకోవడం కోసం ఎవ్వరూ రాకపోవడంతో పోలీసులే దహనం చేశారని అధికారులు తెలిపారు. 


పోలీసులు విచారణ అనంతరం సెప్టెంబరు 12న మంగళవారం మనోహర్‌ శుక్లా, అతడి భార్యను అరెస్ట్‌ చేశారు. శుక్లాపై మీరా భయందర్‌- వసాయి విరార్‌ ప్రాంతంలోని మరో పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు కూడా నమోదైందని పోలీసులు వెల్లడించారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు.