దశాబ్దాల కల అడుగు దూరంలో కనిపిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. త్వరలోనే మహబూబ్‌నగర్, పాలమూరు,రంగారెడ్డి, నల్గొండ జిల్లా వాసులకు కృష్ణా జలాలు అందబోతున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిన్న సాయంత్రం టెస్ట్ రన్ నిర్వహించారు. నార్లాపూర్ జీరో పాయింట్ నుంచి సర్జ్‌పూల్‌లోకి నీటి విడుదలను విజయవంతంగా పరీక్షించారు. ముందుగా హెడ్‌రెగ్యులేటరీ దగ్గర పూజలు చేశారు. ఆ తర్వాత కృష్ణా జలాలను టన్నెల్లోకి.. ఆ తర్వాత సర్జ్‌పూల్‌లోకి తరలించారు. రేగుమాన్‌గడ్డ తీరంలోని అప్రోచ్ కెనాల్ సేఫ్టీ వాల్ 4వ గేటును 4 మీటర్లు ఎత్తి... శ్రీశైలం బ్యాక్ వాటర్‌లోని జీరో పాయింట్ నుంచి వచ్చిన జలాలను విడుదల చేశారు. 20 మీటర్ల వెడల్పు, 255 మీటర్ల పొడవు, 74 మీటర్ల ఎత్తులో నిర్మించిన సర్జ్‌పూల్‌లోకి శ్రీశైలం బ్యాక్ వాటర్ చేరుకుంటున్నాయి.
145 మెగావాట్ల సామర్థ్యం గల ఒక పంపుతో 3వేల ఒక్క క్యూసెక్కుల చొప్పున... 2 టీఎంసీల నీటిని అంజనగిరి జలాశయంలోకి ఎత్తిపోసి నిల్వ చేయబోతున్నారు. ఇప్పటికే డెలివరీ సిస్టమ్ దగ్గర మూడు పంపులను సిద్ధంగా ఉంచారు. సొరంగంలోకి నీటిని వదులుతుండడంతో పక్కనే ఉన్న ప్రత్యామ్నాయ సొరంగం ద్వారా నార్లాపూర్ పంపుహౌస్‌లోకి వెళ్లి మిగిలిన పనులను కార్మికులు పూర్తి చేస్తున్నారు. సొరంగంలోకి నీళ్లను వదలుతున్న సమయంలో... సాంకేతిక సమస్యల తలెత్తితే ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
ఈనెల 16న సీఎం కేసీఆర్ వెట్‌రన్‌ను ప్రారంభించను్నారు. నార్లాపూర్ వద్ద మహాబాహుబలి పంపులను స్విచ్ ఆన్ చేసి నీటి విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే టెస్ట్ రన్ నిర్వహించినట్టు చెప్పారు. అప్రోచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలు టన్నెల్లోకి ప్రవేశించి సర్జ్‌పూల్‌లోకి వెళ్లడంతో ఇరిగేషన్ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. స్వీట్లు తినిపించుకున్నారు.
పాలమూరు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు సాగు, తాగు నీరందించేందుకు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిందే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మించిన కృష్ణా జలాలను ఎత్తిపోసి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు మళ్లించనున్నారు. మహబూబ్‌నగర్, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లా వాసులకు కృష్ణ జలాలు అందబోతున్నాయి. ఆ జిల్లాల పరిధిలో బీడుగా మారిన భూములు మళ్లీ పచ్చని పొలాలుగా మారబోతున్నాయి. పాలమూరు, రంగారెడ్డిలో ఆయకట్టు సాగు పెరగనుంది. దీంతో రైతులు ఏడాదికి మూడు పంటలు వేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఇకపై నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉండవు. రైతన్నల కళ్లల్లో ఆనందం చూసేందుకు త్వరలోనే కృష్ణ జలాలను ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.