రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తి భద్రత కల్పించామన్నారు సీఐడీ తరపు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ కంటే ఎక్కువ భద్రతను కల్పించామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనుమతి లేకుండా... ఆయన బ్లాక్ వద్దకు కూడా వెళ్లలేరని అన్నారు. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాక...సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కోసం ఓ బ్లాక్ మొత్తం కేటాయించామని,  బ్లాక్ మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. హౌస్ కస్టడీ పిటిషన్‌పై స్పందించిన ఆయన,  సీఆర్పీ చట్టంలో అసలు హౌస్ రిమాండ్ అనేది లేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామని అదనపు ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. జైల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటున్నారని తెలిపారు.


స్కిల్ డెవలప్‌మెంట్ పథకం పేరుతో 371 కోట్ల రాష్ట్ర ఖజానాను దోపిడీ చేశారని ఏఏజీ సుధాకర్ రెడ్డి.. షెల్ కంపెనీలపై జీఎస్టీకీ ఆధారాలు దొరికాయన్న ఆయన, గత ప్రభుత్వ పెద్దలు ఈ కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. ప్రజల సొమ్ము దొంగ కంపెనీల ద్వారా ఓ వర్గం చేతిలోకి వెళ్లిందని తెలిపారు. కుంభకోణం ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తోందని,  థర్డ్ పార్టీ అసెస్‌మెంట్ ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు. 


ఎలాంటి చర్చ లేకుండానే ఎంవోయూలు కుదుర్చుకున్నారని, అసలు డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు ఫండ్స్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారని సుధాకర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి తాము చేశామంటూ...ఆనాటి సీఎస్ చెప్పారన్నారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ప్రభుత్వం భారీ భద్రతను కల్పించిందని, 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటారని అన్నారు. చంద్రబాబుకు కావాల్సిన ఆహారం, మందులు సకాలంలో అందుతున్నాయని...సహృదయంతో చంద్రబాబు విన్నపాలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరూ అతీతులు కాదని గుర్తు చేశారు. 


స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు జైలు రిమాండ్‌ను పిటిషన్‌పై తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.