ఫోర్న్‌ వీడియోలు, ఫొటోలు చూడటం అసభ్యకరం.. అదో నేరం. అందరూ ఇదే అభిప్రాయపడుతున్నారు. కానీ కేరళ కోర్టు మాత్రం ఇలాంటి కేసులో కీలక తీర్పు ఇచ్చింది. అశ్లీల ఫోటోలు, వీడియోలను ఇతరులకు చూపించకుండా... ఒంటరిగా చూడటం చట్టం ప్రకారం నేరం కాదని పేర్కొంది. అది ప్రతి వ్యక్తి వ్యక్తిగత ఎంపిక అని చెప్పింది కేరళ  హైకోర్టు. అది నేరం అని చెప్పడం సరికాదని... ఒక వ్యక్తి గోప్యతలోకి చొరబడి.. అతని వ్యక్తిగత ప్రాధాన్యతల్లో జోక్యం చేసుకోవడమే అని చెప్పింది ధర్మాసనం. 33ఏళ్ల తరుణ్‌పై  నమోదైన కేసును రద్దు చేసింది కేరళ హైకోర్టు. అశ్లీల వీడియోలు, ఫొటోలను బహిరంగంగా ప్రదర్శించడం, సర్క్యులేట్‌ చేయడం, పంపించడం నేరమని తెలిపింది.


2016లో అలువ ప్యాలెస్‌ వద్ద రోడ్డుపక్కన మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్న 33ఏళ్ల తరుణ అనే యువకుడిని పట్టుకున్న కేరళ పోలీసులు.. అతనిపై ఇండియన్   పీనల్ కోడ్ IPC సెక్షన్ 292 కింద కేసు నమోదు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని... తనపై కేసు కొట్టేయాలని నిందితుడు తరుణ్‌ కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.   ఆ పిటిషన్‌పై కోర్టులో జస్టిస్ పివి కున్హికృష్ణణ్‌ వాదనలు విన్నారు. ఈ సందర్భంగా... న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ యుగంలో అశ్లీల కంటెంట్   ప్రబలంగా ఉందని కోర్టు పేర్కొంది. చిన్న పిల్లలు కూడా అశ్లీల కంటెంట్‌ను సులభంగా చూడగలిగేలా తయారైందన్నారు. ఈ సందర్భంలో.. ఒక వ్యక్తి తన ప్రైవేట్ సమయంలో   అశ్లీల వీడియోను ఇతరులకు చూపించకుండా చూస్తే నేరంగా పరిగణించబడవచ్చా? అని ప్రశ్నించారు జస్టిస్‌ కున్హికృష్ణణ్‌.


ఫోర్న్‌ వీడియోలు, ఫొటోలను ఒంటరిగా చూడటం తప్పుకాదని... ఏ కోర్టు దానిని నేరంగా పరిగణించదని తెలిపింది కోర్టు. నిందితుడు ఈ వీడియోను బహిరంగంగా ఎవరికీ  చూపించినట్లు ఎలాంటి ఆరోపణ లేవని ధర్మాసనం పేర్కొంది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత సమయంలో అశ్లీల ఫోటోలు, వీడియోలను చూడటం IPC సెక్షన్ 292 ప్రకారం నేరం  కాదని.. తెలిపింది. ఏదైనా అసభ్యకరమైన వీడియో కానీ ఫొటో కానీ బహిరంగంగా ప్రదర్శించడం.. షేర్‌ చేయడం వంటివి చేస్తేనే సెక్షన్ 292 ప్రకారం నేరం అవుతుందని  తెలిపింది కేరళ హైకోర్టు. నిందితుడు ఐపీసీ సెక్షన్ 292 కింద ఎలాంటి నేరం చేయలేదని... కనుకు కేసుకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రొసీడింగ్‌లు రద్దు  చేయబడతాయని తీర్పు ఇచ్చింది. 


అలాగే.. చిన్నపిల్లలు సెల్‌ఫోన్లు అలవాటు చేస్తున్న తల్లిదండ్రులకు కూడా కొన్ని సూచనలు చేశారు జస్టిస్ కున్హికృష్ణన్. పిల్లలను సంతోషంగా ఉంచడానికి మొబైల్ ఫోన్‌లు ఇవ్వడం సరికాదన్నారు. తల్లిదండ్రులు దీని వెనుక ఉన్న ప్రమాదం గురించి తెలుసుకోవాలన్నారు. పిల్లలు వారి పర్యవేక్షణలో సందేశాత్మక వీడియోలను చూడటానికి అనుమతించాలే కానీ... వారికి వినోదం కోసం మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదన్నారు. ఈ రోజుల్లో మొబైల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రతిచోటా అశ్లీల వీడియోలు సులభంగా అందుబాటులో ఉన్నాయని జస్టిస్ కున్హికృష్ణన్ అన్నారు. మైనర్లు అశ్లీల వీడియోలు చూడటం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.