Vietnam Fire Accident:
అగ్నిప్రమాదం...
వియత్నాం రాజధాని హనోయ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఓ ఫ్లాట్‌లో నుంచి ఓ చిన్నారి అరుపులు గట్టిగా వినిపించాయని స్థానికులు చెప్పారు. వెంటనే ఆ చిన్నారిని ఎవరో పై నుంచి కిందకు తోసేశారని తెలిపారు. పది అంతస్థుల ఈ బిల్డింగ్‌లో పార్కింగ్ ఫ్లోర్‌లో మంటలు మొదలయ్యాయి. అక్కడే పార్క్ చేసి ఉన్న బైక్‌లు, కార్‌లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎంత మంది మృతి చెందారన్నది అధికారికంగా వెల్లడించలేదు. 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆంబులెన్స్‌లు పెద్ద ఎత్తున తరలి వచ్చి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. 70 మందిని రక్షించారు. ఘటన తీవ్రత అనూహ్యంగా పెరిగిందని, అనుకున్న దాని కన్నా మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ టీమ్‌లు వెంటనే అప్రమత్తమై బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. కానీ...మంటలు తీవ్రతరం కావడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కి ఆటంకం కలిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అపార్ట్‌మెంట్ నుంచి అరుపులు వినిపించాయని..కానీ వాళ్లను ఎలా రక్షించాలో తెలియక అలాగే ఉండిపోయామని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున మంటలు చెలరేగాయని, బిల్డింగ్ చాలా ఇరుగ్గా ఉండడం వల్ల లోపలకి వెళ్లలేకపోయామని తెలిపారు. బాల్కనీలు చాలా చిన్నగా ఉన్నాయి. ఎమర్జెన్సీ ల్యాడర్ కూడా అందుబాటులో లేదు. ఒకటే ఎగ్జిట్ పాయింట్ ఉంది. ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 150 మంది ఉంటున్నారు.
"నేను అప్పుడు నిద్రపోవాలని అనుకుంటుండగా ఏదో కాలిపోయిన వాసన వచ్చింది. వెంటనే బయటకు వచ్చి చూశాను. చుట్టూ పొగ కమ్ముకుంది. ఆ సమయంలోనే ఓ చిన్నారిని పై నుంచి కిందకు విసిరేశారు. ఆ చిన్నారి బతికున్నాడా లేదా అన్నది కూడా క్లియర్‌గా కనిపించలేదు. బిల్డింగ్ చాలా ఇరుగ్గా ఉంది. మేం సాయం చేయాలనుకున్నా మాకు కుదరలేదు. రెస్క్యూ టీమ్‌లు వచ్చినా లోపలున్న వాళ్లను రక్షించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది"
- స్థానికులు
Also Read: కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరేం కాదు, సేఫ్‌టీ లేకపోతే కంపెనీలకే నష్టం - నితిన్ గడ్కరీ