Nitin Gadkari: 



నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు..


కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్లలో 6 ఎయిర్ బ్యాగ్‌లు (Air Bags) తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను విధించే ఆలోచనలో ప్రభుత్వం లేదని స్పష్టం చేశారు. నిజానికి ఈ ఏడాది అక్టోబర్ నాటికి అన్ని కార్లలో తప్పనిసరిగా 6 ఎయిర్ బ్యాగ్‌లు ఉండాలని గతంలో ప్రకటించింది కేంద్రం. భద్రతా ప్రమాణాలను పాటించాల్సిందే అని వెల్లడించింది. కానీ..ఇప్పుడు గడ్కరీ కామెంట్స్‌ని బట్టి చూస్తుంటే ఈ గడువుని ఇంకా పెంచే అవకాశాలున్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కార్లు తయారు చేయాలా వద్దా అన్నది కంపెనీల ఇష్టమని, ఇప్పటికైతే కొన్ని సంస్థలు దీన్ని అమలు చేస్తున్నాయని వివరించారు గడ్కరీ. ప్రస్తుతానికి కార్‌ కొనే వాళ్లంతా సేఫ్‌టీ గురించే ఆలోచిస్తున్నారని, ఈ విషయంలో వెనకబడితే ఆయా సంస్థలకే నష్టం అని సున్నితంగానే మందలించారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్‌ల విక్రయాలు పడిపోవడం తప్పదని తేల్చి చెప్పారు. స్టార్ రేటింగ్ ఇవ్వడం వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీకి మంచి జరుగుతోందని తెలిపారు. గతేడాది కేంద్రం అధికారికంగా ఓ ప్రకటన చేసింది. వెహికిల్ సేఫ్టీలో భాగంగా Central Motor Vehicles Rules (CMVR), 1989లో కొన్ని సవరణలు చేసింది. ఈ సవరణల ప్రకారం...2021 ఏప్రిల్ 1 తరవాత తయారయ్యే కార్‌లలో ముందు, వెనక సీట్‌లలో కూర్చునే వాళ్లకు భద్రత కల్పించేలా ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ తప్పనిసరిగా ఉండాలని తేల్చి చెప్పింది. 8 సీటర్ వెహికిల్స్‌లో దీన్ని Mandatory చేసింది. గతేడాది అక్టోబర్ 1 లోగా అన్ని సంస్థలు ఈ రూల్‌ పాటించాలని తెలిపింది. కానీ...గడ్కరీ ఈ గడువుని 2023 అక్టోబర్ 1కి మార్చారు. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టి...అసలు ఆ నిబంధన పాటించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.


కాస్ట్ పెరుగుతుంది.. 


కేంద్ర రవాణా శాఖ లెక్కల ప్రకారం దేశంలో రోడ్డు ప్రమాదాలతో ప్రతి రోజు 400 మంది మరణిస్తున్నారు. ఏడాదికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోందని, ఈ ప్రమాద బాధితుల్లో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది. అయితే ఎయిర్ బ్యాగ్స్ నిబంధన బాగానే ఉన్నా...వినియోగదారులపై భారం పడక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే కార్ల ధరలు ప్రియమైపోయాయి. తయారీ ధరలు పెరగటం వల్ల ఈ మధ్య కాలంలో కార్ల ధరలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేస్తే ఆ మేరకు కాస్ట్ పెరుగుతుంది. కొన్ని కంపెనీలు కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. వినియోగదారులపై అదనపు భారం పడుతుందని వాదిస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు...కేంద్రం ఆదేశాల ప్రకారం ఇప్పటికే తయారీలో మార్పులు చేర్పులు చేయటం మొదలు పెట్టాయి. 
వాహన తయారీదారులు వెనుక సీట్లకు కూడా సీటు బెల్ట్ అలారం వ్యవస్థను ప్రవేశపెట్టడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి నితిన్ గడ్కరీ గతంలో వెల్లడించారు. కానీ...ఇప్పుడు ఉన్నట్టుండి ఈ నిబంధన తప్పనిసరేం కాదని గడ్కరీ చెబుతుండటం వల్ల కేంద్రం వెనక్కి తగ్గిందేమో అన్న సంకేతాలిస్తోంది. 


Also Read: సెప్టెంబర్ 17న అఖిలపక్ష సమావేశం, ప్రత్యేక సమావేశాల అజెండాపై చర్చ!