AIADMK New Alliance:
అన్నా డీఎమ్‌కే కొత్త కూటమి..
ఇటీవలే NDA కూటమి నుంచి AIADMK పార్టీ బయటకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై మరో కీలక ప్రకటన చేసింది ఆ పార్టీ. ప్రత్యేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలతోనే ఈ కొత్త కూటమితో బరిలోకి దిగనున్నట్టు స్పష్టం చేసింది. బీజేపీతో తమ పొత్తు ఇకపై ఉండదని తేల్చి చెప్పింది. ఇన్నాళ్లూ అధికార పక్షం DMKకి ఇదో అస్త్రంగా ఉండేది. AIDMK బీజేపీతో ఉండడంపై తీవ్ర విమర్శలు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌తో పాటు ఉదయనిధి స్టాలిన్ కూడా అన్నా డీఎమ్‌కే పార్టీపై ఇటీవల మండిపడ్డారు. సరిగ్గా మూడు రోజుల తరవాత AIDMK NDA నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించింది. దాదాపు నాలుగేళ్లుగా బీజేపీతోనే కలిసి ఉంది ఈ పార్టీ. అయితే...తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైని తొలగించాలని అన్నాడీఎమ్‌కే పార్టీ పట్టుబట్టిందని, ఈ విషయంలో విభేదాలు రావడం వల్లే NDA నుంచి బయటకు వచ్చేసిందన్న వాదనలు వినిపించాయి. దీనిపై అన్నాడీఎమ్‌కే నేత మునుస్వామి క్లారిటీ ఇచ్చారు. ఇంత పెద్ద పార్టీ అలాంటి పనులు చేసిందంటే ఎలా నమ్ముతారంటూ మండి పడ్డారు.
"బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని తొలగించాలని మా పార్టీ డిమాండ్ చేసిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇలా అడగడం ఎంత పిల్లలాటగా ఉంటుందో మాకు తెలియదా..? అలాంటి తప్పులు మేం ఎప్పటికీ చేయం. మేం అనాగరికులం కాదు. వేరే పార్టీ ఎలా నడవాలో చెప్పడానికి మేం ఎవరం..? అన్నాడీఎమ్‌కే అలాంటి పార్టీ కాదని గుర్తు పెట్టుకోండి. మేం NDA నుంచి బయటకు రావడాన్ని కూడా డీఎమ్‌కే ఓ డ్రామా అని కొట్టి పారేస్తోంది. మేం బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని DMK భయపడుతోంది. అందుకే ఇలా మాట్లాడుతోంది. ఇకపై NDAలో చేరేది లేదు. కానీ కొత్త కూటమిని ఏర్పాటు చేస్తాం"
- కేపీ మునుస్వామి, AIDMK నేత
బీజేపీతో అన్నాడీఎంకే తెగదెంపులు చేసుకుంది. ఇకపై ఎన్డీఏ భాగస్వామిగా ఉండబోవడం లేదని ప్రకటించింది. తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్25న జరిగిన పార్టీ కీలక నేతల సమావేశం తర్వాత ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ దిగ్గజం సీఎన్ అన్నాదురైపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో.. బీజేపీతో విడిపోవాలని AIADMK ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి తెలిపారు. ఈ రోజు నుంచి బీజేపీ, ఎన్డీయే కూటమితో అన్నాడీఎంకే తెగదెంపపులు చేసుకుంటోందనని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత ఏడాది కాలంగా మా మాజీ నాయకులు, మా ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ పై, అలాగే పార్టీ కార్యకర్తల గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మునుసామి చెప్పారు. బీజేపీతో పొత్తు తెగదెంపుల సందర్భంగా పార్టీ కార్యాలయం బయట పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
Also Read: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్‌ఎస్ స్వామినాథన్ కన్నుమూత