The word Hindu from Persia: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సతీష్ జార్కిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ అనే పదానికి భారతదేశంతో సంబంధం లేదన్నారు. హిందూ అనే పదానికి దారుణమైన అర్థం ఉందని, ఇది పర్షియా పదం అంటూ సతీష్ జార్కిహోళి బెళగావి జిల్లాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలపై బలవంతంగా హిందూ అనే పదం రుద్దారని, మీరు హిందూ ఎలా అయ్యారో తెలుసుకోవాలన్నారు. కావాలంటే వికీపీడియాలో సెర్చ్ చేసి విషయం తెలుసుకోవాలని, ఇది తన అభిప్రాయం కాదని వ్యాఖ్యానించారు.
అర్థం తెలిస్తే సిగ్గుపడతారంటూ కామెంట్స్
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు సతీష్ జార్కిహోళి ఇంకా ఏమన్నారంటే.. హిందూ అనే పదం, మతాన్ని భారతదేశంలో ప్రజలపై బలవంతంగా రుద్దారు. ఈ పదం ఎక్కడినుంచి వచ్చిందని పరిశోధన చేస్తే ఇది పర్షియా పదమని తెలిసింది. హిందూ పదం మూలాలు ఇరాన్, ఇరాక్, ఉబ్జెకిస్తాన్, కజకిస్తాన్ దేశాల్లో ఉన్నాయి. అయితే హిందూ అనే పదానికి భారతదేశంతో ఏం సంబంధం ఉంది ?. మీరు ఈ దీన్ని ఎందుకు అంగీకరిస్తున్నారు. ఈ విషయంపై కచ్చితంగా చర్చ జరగాలి. వికీపీడియాలో సెర్చ్ చేస్తే మీకు హిందూ పదం మూలాలు తెలుస్తాయి. ఆ పదానికి అర్థం తెలుస్తే మీరు సిగ్గుపడతారు’ అని తన కామెంట్లతో కాంగ్రెస్ నేత పెద్ద వివాదానికి తెరతీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జాతీయ మీడియా ఏఎన్ఐ ట్విట్టర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. తమను టార్గెట్ చేశారని కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
సతీష్ జార్కిహోళి వ్యాఖ్యల్ని ఖండించిన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీ అన్ని మతాల నమ్మకాన్ని, విశ్వసాన్ని గౌరవిస్తుందన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా. కర్ణాటక కాంగ్రెస్ నేత సతీష్ జార్కిహోళి హిందూ పదంపై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. జార్కిహోళి చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. హిందూత్వం అనేది జీవన విధానం అని, నాగరికతకు రూపమని సుర్జేవాలా పేర్కొన్నారు. అవి సతీష్ జార్కహోళి వ్యక్తిగత అభిప్రాయాలంటూ ఈ మేరకు ట్వీట్ చేశారు.
బీజేపీ నేతలు ఫైర్
గతంలో సిద్ధరామయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు ఆయన అనుచరుడు, సతీష్ జార్కిహోళి అదే పని చేశారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదని, అన్ని మతాలకు చెందిన వారి విశ్వాసాలను గౌరవించాలని కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్. సీఎన్ అశ్వత్ నారాయణన్ చెప్పారు. ప్రజలలో మతాలపై అనుమానాలు రేకెత్తించడం సరికాదని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రజా సంక్షేమం కోరుకున్నట్లయితే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరూ చేయరన్నారు. హిందూ పదంపై సతీష్ జార్కిహోళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.