WhatsApp banned : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) లక్షలాది భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వాట్సాప్ (Whatsapp) తమ యూజర్లకు సంబంధించిన భద్రతా నివేదికను విడుద‌ల‌ చేసింది. 2023 ఫిబ్ర‌వ‌రిలో 45 లక్షల బ్యాడ్‌ అకౌంట్లను నిషేధించిందని పేర్కొంది. 


భారతీయుల‌కు చెందిన 4,597,400 అకౌంట్ల‌ను బ్యాన్ చేసినట్టు ప్ర‌ముఖ‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది. "ఫిబ్రవరి 1 నుంచి 28 మధ్య 4,597,400 WhatsApp ఖాతాలు నిషేధించాం, వినియోగదారుల నుండి ఎటువంటి నివేదికలు రాకముందే వీటిలో 1,298,000 ఖాతాలు ముంద‌స్తుగా నిషేధించబడ్డాయి", అని WhatsApp నెలవారీ భ‌ద్ర‌తా నివేదికలో పేర్కొంది. కొత్త ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆ సంస్థ‌ తెలిపింది.


దేశంలో దాదాపు 500 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్.., ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో 2,804 ఫిర్యాదులను అందుకుంది. వాటిలో 504 ఫిర్యాదుల‌పై చర్యలు తీసుకుంది. వాట్సాప్ యూజర్ల భద్రత గురించి సంస్థ‌ ప్రతినిధి మాట్లాడుతూ.. "ఈ వినియోగదారు-భద్రతా నివేదికలో స్వీకరించబడిన వినియోగదారుల‌ ఫిర్యాదుల వివరాలు, వాట్సాప్ తీసుకున్న సంబంధిత చర్యలు, అలాగే మా ప్లాట్‌ఫారంలో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి WhatsApp సొంత నివారణ చర్యలు ఉన్నాయి" అని తెలిపారు. "మేము మా పనిలో పారదర్శకతతో కొనసాగుతాం. భవిష్యత్ నివేదికల్లో మా ప్రయత్నాల గురించి సమాచారాన్ని చేర్చుతాం" అని వెల్ల‌డించారు.


ల‌క్ష‌లాది మంది భారతీయ సోషల్ మీడియా వినియోగదారులకు సాధికారత కల్పించే ప్రయత్నంలో, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవలే గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ప్రారంభించారు, ఇది కంటెంట్  ఇతర సమస్యలకు సంబంధించి వారి ఆందోళనలను పరిశీలిస్తుంది. దేశంలోని డిజిటల్ చట్టాలను పటిష్టపరిచేందుకు ఉద్దేశించిన ఈ నిర్ణ‌యం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల నిర్ణయాలకు వ్యతిరేకంగా యూజర్ల అప్పీళ్లను పరిశీలిస్తుంది. 


50 లక్షల మందికిపైగా యూజర్లను కలిగి ఉన్న డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కచ్చితంగా తమ కాంప్లియెన్స్ రిపోర్ట్స్‌ను ప్రతి నెలా సమర్పించాలని భారత ఐటీ చట్టం చెబుతోంది. దీనిని 2021 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి? యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంది? వంటి వివరాలన్నీ అందులో తెలపాల్సి ఉంటుంది.


ఇటీవల సవరించిన ఐటి రూల్స్, 2021 ప్రకారం మూడు జీఏసీలను ఏర్పాటు చేయాలని ఐటి మంత్రిత్వ శాఖ గత నెలలో నోటిఫై చేసింది. బహిరంగ, సురక్షితమైన, విశ్వసనీయమైన, జవాబుదారీగా ఉండే ఇంటర్నెట్‌ను అందించడంలో భాగంగా, ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖ 'డిజిటల్ నాగ‌రిక్స్‌' హక్కులను రక్షించే లక్ష్యంతో కొన్ని సవరణలు సూచించింది.


వాట్సాప్ అకౌంట్లపై రిపోర్టు చేయాలంటే.. WhatsApp Settings వెళ్లండి >Help > Contact Us ద్వారా సంప్రదించండి. మీరు భారత్‌లోని ఫిర్యాదు అధికారిని సంప్రదించడానికి మీ ఫిర్యాదు లేదా ఆందోళనతో ఈ-మెయిల్ పంపవచ్చు. ఎలక్ట్రానిక్ సైన్ చేయవచ్చు. మీరు నిర్దిష్ట అకౌంట్ గురించి అధికారిని సంప్రదిస్తే.. దయచేసి కంట్రీ కోడ్‌ (+91)తో సహా పూర్తి అంతర్జాతీయ ఫార్మాట్‌లో మీ ఫోన్ నంబర్‌ను యాడ్ చేయండి.