UCC in North East:
UCCపై వ్యతిరేకత..
యునిఫామ్ సివిల్ కోడ్ (UCC)ని అమలు చేసేందుకు అన్ని విధాలుగా కసరత్తులు మొదలు పెట్టింది మోదీ సర్కార్. స్వయంగా ఆయనే దీనిపై ప్రకటన చేయడం వల్ల త్వరలోనే బీజేపీ ఆ అస్త్రాన్ని బయటకు తీస్తోందని స్పష్టమైంది. దీన్ని సమర్థించే వాళ్లెంత మంది ఉన్నారో...వ్యతిరేకించే వాళ్లూ అదే స్థాయిలో ఉన్నారు. ఈ నెల 20 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అప్పుడే ఈ బిల్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని చూస్తోంది బీజేపీ. అయితే...ముస్లింల నుంచే కాకుండా ఈశాన్య రాష్ట్రాల ప్రజల నుంచి కూడా Uniform Civil Codeపై అసహనం వ్యక్తమవుతోంది. అక్కడి ప్రజలు ఈ పేరు చెబితేనే మండి పడుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే...ఆయా రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు కూడా దీన్ని అపోజ్ చేస్తున్నాయి. మేఘాలయాలో బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కనార్డ్ సంగ్మా వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. "ఇది భారతీయతకు సరిపడే చట్టం కాదు" అని తేల్చి చెప్పారాయన. అంతే కాదు. అంతకన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంగ్మా. "భారతదేశంలో ఎన్నో విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలున్నాయి. వాటన్నింటిలోనూ ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి చాలా ఇంకాస్త విభిన్నమైంది. దాన్ని కాపాడుకునేందుకు మేం ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాం" అని వెల్లడించారు. మరి ఈశాన్య రాష్ట్రాలు ఎందుకంత స్పెషల్..?
ఏంటి సమస్య..?
ఈశాన్య రాష్ట్రాలు భారత్‌కే కాదు. మొత్తం ప్రపంచానికే ప్రత్యేకం. అక్కడ ఉన్నన్ని సంస్కృతులు ఇంకెక్కడా కనిపించవు. దాదాపు 220 జాతులకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు. ట్రైబల్స్ సంఖ్య కూడా ఎక్కువే. 2011 జనాభా లెక్కల ప్రకారం..మిజోరంలో 94.4%, నాగాలాండ్, మేఘాలయాల్లో వరుసగా 86.5%, 86.1% గిరిజనులున్నారు. అంటే వీళ్లదే అత్యధిక జనాభా. వీళ్లంతా భారత రాజ్యాంగానికి లోబడి ఉంటూనే తమ తమ ఆచారాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు యునిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే...వాళ్ల ఆచారాలు దెబ్బ తింటాయని ఆందోళన చెందుతున్నారు వారంతా. మిజోరం, నాగాలాండ్, మేఘాలయాలో ఈ అసహనం ఎక్కువగా కనిపిస్తోంది. లా కమిషన్ రిపోర్ట్ ప్రకారం..అసోం, బిహార్, ఒడిశాల్లోని గిరిజనులు కూడా తమ ఆచారాలను చాలా కచ్చితంగా పాటిస్తారు. అసోంలో ఖాసిలు, బిహార్ ఒడిశాలో కూర్గ్ క్రిస్టియన్స్, జ్యెంతెంగె, ముండా, ఒరోన్ తెగలున్నాయి. వీరిలో ఖాసి సహా మరి కొన్ని తెగలు ఇప్పటికీ మాతృస్వామ్యాన్నే కొనసాగిస్తున్నాయి. అంటే...ఆడవాళ్లకే అన్ని అధికారాలుంటాయి. ఇప్పుడు UCC వస్తే ఆ ఆచారం మంటగలిసి...అధికారమంతా పురుషుల చేతుల్లోకి వెళ్లిపోతుందని పితృస్వామ్యం వస్తుందని ఆందోళన పడుతున్నారు.
సవాళ్లేంటి..?
మిజోరంలోని గిరిజనులంతా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే యునిఫామ్ సివిల్‌కోడ్‌కి వ్యతిరేకంగా ఓ తీర్మానం పాస్ చేశాయి. రాజ్యాంగంలోని Article 371G మిజోరంకి ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. ఇక్కడి ఆచారాలకు, సంస్కృతులకు అవాంతరం కలిగించే ఏ చట్టాన్నైనా అమలు చేయడానికి వీల్లేదు. అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి దానికి ఆమోదం లభించి చట్టం అయితే తప్ప అమలు చేయడానికి అవకాశముండదు. ఇక మేఘాలయాలో ఖాసి, జైంటియా, గరో తెగల్లో ఒక్కో తెగకు ఒక్కో రకమైన ఆచారాలున్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో. వీళ్ల ఆచారాలకు అడ్డం తగిలే చట్టాన్ని అమలు చేయడానికి వీలుండదు. అటు నాగాలాండ్‌లోనూ ఇదే స్థాయిలో వ్యతిరేకత ఉంది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర ప్రజలు ఈ బిల్‌పై ఉత్కంఠగా చూస్తున్నారు. సిక్కింలో ఉన్నత స్థాయి భేటీ జరగనుంది. ఇలా దాదాపు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఒక్కసారిగా అలజడి రేపింది UCC.
Also Read: MP High Court: శృంగార అంగీకార వయసు 16 ఏళ్లకి తగ్గించండి - కేంద్రానికి హైకోర్టు సూచన
Join Us on Telegram: https://t.me/abpdesamofficial