మన దేశంలో పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడానికి చట్టపరమైన వయస్సు 18 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. అయితే, బాలికల విషయంలో ఈ అంగీకార వయస్సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు చెందిన గ్వాలియర్ బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మారిన పరిస్థితులు, ఈ ఇంటర్నెట్ యుగంలో యువతీ, యువకుల్లో 14 ఏళ్లకే యవ్వనపు ఆలోచనలు, పెద్దరికం అధికంగా ఉంటున్నాయని పేర్కొంది. దానివల్ల ఒకరికొకరు ఆకర్షితులవుతున్నారని, పరస్పర అంగీకారంతో సంబంధాలు పెట్టుకుంటున్నారని హైకోర్టు ధర్మానం వ్యాఖ్యానించింది.


2020లో ఒక బాలికను యువకుడు అనేక సార్లు అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడని ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విషయంలో గ్వాలియర్ హైకోర్టు ఈమేరకు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ కేసును హైకోర్టు జూన్‌ 27న కొట్టివేసింది. ఈ సమాచారం బయటకు రాగానే యువకుడు దోషిగా తేలాడని, ఇలాంటి కేసుల్లో యువడిని నిందితులుగా పరిగణించలేమని పేర్కొంది.


నిర్భయ ఘటన తర్వాత పెరిగిన వయసు
నిజానికి ఐపీసీకి సవరణ చేయక ముందు ఈ వయసు 16 ఏళ్లుగానే ఉండేదని తెలిపారు. దీన్ని పునరుద్ధరించడం ద్వారా బాలురకు అన్యాయం జరగకుండా కాపాడవచ్చని న్యాయమూర్తి అన్నారు. నిర్భయ ఘటన తర్వాత లైంగిక వేధింపుల చట్టాన్ని కఠినతరం చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని కోర్టు పేర్కొంది. దీని ప్రకారం, IPCలోని సెక్షన్ 375 (6) ఏకాభిప్రాయానికి సంబంధించిన వయస్సును 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు పెంచారని, అయితే దీని తర్వాత ఇటువంటి అనేక కేసులు తెరపైకి వచ్చాయని గుర్తు చేసింది. ఈ సందర్భాల్లో పరస్పర అంగీకారంతో శృంగారం జరిగిన తర్వాత కూడా, బాలురను నిందితుడిగా చేసి చర్యలు తీసుకున్నారని కోర్టు వెల్లడించింది.


2020 నాటి కేసులో అప్పీల్
ఓ విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రాహుల్ పిటిషన్‌ను విచారించిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ అగర్వాల్ కేంద్ర ప్రభుత్వానికి ఈ అభ్యర్థన చేశారు. అత్యాచారం ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని నిందితుడు రాహుల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ సందర్భంలో, మైనర్ బాధితురాలు ఆరోపించిన అత్యాచారం కారణంగా గర్భవతి అయ్యింది. అబార్షన్ కోసం తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత 2020 సెప్టెంబర్‌లో అబార్షన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. రాహుల్ 2020 జూలై నుంచి జైలులోనే ఉన్నాడు.


ఇంటర్నెట్ కారణంగా తొందరగా పెద్దరికం
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్ కారణంగా ప్రస్తుతం అబ్బాయిలు, బాలికలు 14-15 ఏళ్లలోపే యవ్వనంగా మారుతున్నారని అన్నారు. దీని కారణంగా, అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతారని, పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కలిగి ఉంటున్నారని అన్నారు. ‘‘రాహుల్ అమ్మాయితో ఏకాభిప్రాయంతోనే శారీరక సంబంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఇక్కడ వయస్సు మాత్రమే అడ్డంకిగా ఉంది. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని, చట్టాన్ని రూపొందించేవారు లైంగిక సంపర్క వయస్సును 16 సంవత్సరాలకు తిరిగి తీసుకురావాలి. ఈ తరహా కేసుల్లో నేడు చాలా సందర్భాలలో ఆడపిల్లల వయస్సు 18 ఏళ్లలోపు ఉండడం వల్ల యువకులకు అన్యాయం జరుగుతోంది. పరస్పర అంగీకారంతో సంబంధాలు పెట్టుకునే వయస్సును కేంద్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించి 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించి ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలి’’ అని న్యాయమూర్తి వెల్లడించారు.