మనీలాండరింగ్‌:
బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రక్రియనే మనీ లాండరింగ్ అని అంటారు. అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన లేదా ఆదాయానికి మించి సమకూరిన సంపాదనను బ్లాక్ మనీ అని అంటారు. అయితే మొన్నటి మొన్న మహారాష్ట్రలో ఫేక్‌ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. థానే క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నకిలీ కరెన్సీని సీజ్‌ చేశారు.  8 కోట్ల విలువజేసే 2వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. వారు పాల్ఘర్‌కు చెందినవారుగా గుర్తించారు. అంతేకాదు.. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో హైదరాబాద్‌లో కూడా భారీ మొత్తంలో బ్లాక్‌ మనీ బయటపడింది. సుమారు 10.50 కోట్లకు పైగా నగదు పోలీసులు స్వాధీనం చేసుకోవటం చర్చనీయాంశం అయింది. అయితే ఈ మనీల్యాండరింగ్‌ అనేది మూడు దశలో జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా ప్లేస్‌మెంట్‌, లేయరింగ్‌, ఇంటిగ్రేషన్‌ అనే మూడు దశల్లో జరుగుతుంది. ఇంతకీ.. మనీ లాండరింగ్‌ అంటే ఏమిటి..? మనీ లాండరింగ్‌.? హవాలా.? అంటే ఒక్కటేనా..? ఇంతకీ హవాలా నెట్‌వర్క్‌ ఎలా పని చేస్తుంది.? 


ప్లేస్‌మెంట్‌:
ఉన్నపళంగా అక్రమంగా వచ్చిన భారీ డబ్బు లేదా ఆదాయాన్ని డబ్బును బ్యాంకులో డిపాజిట్‌ చేయ్యాలి. కానీ అలా చేయకుండా ఆ డబ్బును చిన్న మొత్తాలుగా విడదీసి, వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లలో జమ చేస్తారు. అయితే ఇలా చట్టవ్యతిరేకంగా సంపాదించిన డబ్బును మాత్రమే ఇలా చేస్తారు. దీనినే ప్లేస్‌మెంట్‌ అని అంటారు.  


లేయరింగ్‌:
లేయరింగ్‌ అనగా.. చిరునామా అక్కర్లేని, విదేశీ బ్యాంకులలోనూ, దేశంలోని బాండ్లు, స్టాక్స్‌, ట్రావెలర్స్‌ చెక్కుల రూపములో మార్చుతారు. ఇది మనీ లాండరింగ్ ప్రక్రియలో కీలకమైన దశ అనే చెప్పాలి. అంతేకాదు..లెక్కలేనన్ని లావాదేవీలను నిర్వహించి, డబ్బు మూలాలను, అసలు యజమానిని ఎవరన్న విషయం తెలియకుండా చేస్తారు. అంతేకాదు.. ఈ దశలో డబ్బును పూర్తిగా ఆర్ధిక వ్యవస్థలోకి తెచ్చేందుకు సంక్లిష్టమైన లావా దేవీలు జరుగుతాయి. ఈ లావాదేవీలను కనిపెట్టడం అధికారులకు చాలా కష్టంగా మారుతుంది. ఈ పనిని చాలా వ్యూహాత్మకంగా, తప్పుడు లెక్కల ద్వారా చేస్తారు.


ఇంటెగ్రేషన్‌:
ఇంటెగ్రేషన్‌లో అక్రమంగా సంపాదించిన డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటారు. 
ఈ అక్రమంగా సంపాదించిన డబ్బుతో ప్రాపర్టీ కొనడం లేదా మార్కెట్, ఖరీదైన కార్లు, నగలు, లేదా ఖరీదైన వస్తువులను కొనుక్కునేందుకు వాడతారు. ఎవరూ తమను  పట్టుకోలేరనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో లాండరర్‌ అక్రమంగా సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. దీంతో చట్టవ్యతిరేకంగా సంపాదించిన నల్ల ధనం అంతా ఇప్పుడు వైట్ మనీగా మారిపోతుంది. దీనినే ఇంటెగ్రేషన్ అని అంటారు.


హవాలా అంటే ఏమిటి.?
హవాలా అంటే బదిలీ లేదా దీనినే హండి అని కూడా అంటారు. స్థానికంగా, అంతర్జాతీయంగా అనేక ప్రాంతాల్లో సాధారణంగా ఉపయోగించే అనధికారిక నిధుల బదిలీ వ్యవస్థలలో ఒకటి ఇది. డబ్బును ఒక దేశంలో నుంచి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్‌వర్‌ చేసేందుకు హవాలాదార్లు ప్రపంచమంతటా చాలా మంది ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థకు సమాంతరంగా ప్రజలు ఈ అనధికార, సంప్రదాయ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. దీనిలోని మధ్యవర్తులను హవాలాదార్‌లని పిలుస్తారు. వీరిపై ఉండే నమ్మకంపై ఆధారపడి ఈ మొత్తం వ్యవస్థ నడుస్తుంది. 


హవాల నెట్‌వర్క్‌ ఎలా పని చేస్తోంది.?
ఉదాహరణకు.. అమెరికాలో ఉన్న వ్యక్తికి చైనా నుంచి పంపించాలంటే.. ముందుగా మనం చైనా ఉండ హవాలాదార్‌ను కలవాలి. ఇందులో గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎలాంటి బ్యాంక్ ఖాతా అవసరం లేకుండానే ఈ విధానంలో డబ్బులు పంపొచ్చు. ఇందుకు చైనాలోని హవాలాదార్‌ కొంత కమిషన్‌ తీసుకుని ఈ పనిని చేస్తాడు. చైనాలోని ఉన్న హవాలాదార్‌కు డబ్బులు ఇచ్చిన వెంబడే అతడు.. ఓ పాస్‌వర్డ్‌ను చెబుతాడు. ఇప్పుడు ఆ డబ్బును తీసుకోవాలని అనుకునేవారు అదే పాస్‌వర్డ్‌ను రెండో హవాలాదార్‌కు చెప్పాలి. డబ్బులు తీసుకునే వ్యక్తి చెబుతున్న పాస్‌వర్డ్ సరైనదో కాదో రెండో హవాలాదార్ పక్కాగా చూసుకుంటాడు. అన్నీ సవ్యంగా ఉంటే, గంటల్లోనే రెండో వ్యక్తి చేతిలోకి డబ్బులు వెళ్లిపోతాయి. డబ్బులు చేతులు మార్చినందుకు ఇద్దరు హవాలాదార్‌లు స్పల్ప మొత్తంలో కమీషన్ తీసుకుంటారు.