Brij Bhushan Singh:


కోర్టులో ఢిల్లీ పోలీసుల వివరణ..


మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కి ఢిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా వాళ్లని వేధించినట్టు ఢిల్లీ కోర్టులో వెల్లడించారు. ఆయనపై చర్యలు తీసుకోవడానికి అవసరమైన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. నిజానికి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో భూషణ్ సింగ్‌ కూడా విచారణకు హాజరవ్వాల్సి ఉన్నప్పటికీ కోర్టు అందుకు మినహాయింపునిచ్చింది. తజికిస్థాన్‌లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్టు పోలీసులు కోర్టుకి వెల్లడించారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌కి తాను చేసేది తప్పు అని తెలిసినా పదేపదే అదే తప్పు చేశారని స్పష్టం చేశారు. 


"తజికిస్థాన్‌లో ఓ ఈవెంట్‌కి వెళ్లినప్పుడు ఓ మహిళా రెజ్లర్‌ని బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించారు. ఇదే విషయాన్ని బాధితురాలు మాకు చెప్పింది. తన గదికి పిలిపించుకుని ఆమెపై ఒత్తిడి చేసి గట్టిగా కౌగిలించుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఓ తండ్రిగా చేశానని, అందులో తప్పుడు ఉద్దేశం లేదని బ్రిజ్ భూషణ్ చెప్పారు. అంటే అదంతా తెలిసే చేసినట్టే కదా. బాధితురాలు వెంటనే స్పందించిందా లేదా అన్నది విషయం కాదు. కానీ ఆమెని వేధించారన్నది నిజం"


- ఢిల్లీ పోలీసులు


మూడేళ్ల జైలు శిక్ష..? 


మరో ఫిర్యాదు గురించీ ఢిల్లీ పోలీసులు కోర్టులో ప్రస్తావించారు. తజికిస్థాన్‌లో ఏషియన్ ఛాంపియన్‌ షిప్ జరిగినప్పుడు ఓ మహిళా రెజ్లర్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్టు వెల్లడించారు. బలవంతంగా షర్ట్‌ పైకి అని పొట్టను తాకినట్టు తెలిపారు. ఆయా రెజ్లర్ల వాంగ్మూలం తీసుకున్నట్టు పేర్కొన్నారు. గతంలో ఈ కేసులో విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన కమిటీ బ్రిజ్ భూషణ్‌ని నిర్దోషిగా తేల్చలేదని, ఇదీ పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు వాదించారు. మహిళా రెజ్లర్ల చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్రీడామంత్రి నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ అందులో ఏముందన్నది బయట పెట్టలేదు. ఢిల్లీ పోలీసులకు మాత్రమే ఆ కాపీ అందించారు. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ దోషిగా తేలితే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. జూన్ 15వ తేదీన భూషన్‌పై ఛార్జ్‌షీట్‌ కూడా దాఖలైంది. అక్టోబర్ 7వ తేదీన మరోసారి ఈ కేసుని ఢిల్లీ కోర్టు విచారించనుంది. 


WFI చీఫ్‌ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లను సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలని ఢిల్లీ పోలీసులు గతంలోనే అడిగారు. ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లతో మాట్లాడిన పోలీసులు "ఎవిడెన్స్" కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆయన లైంగికంగా వేధించాడు అనడానికి సాక్ష్యంగా ఫోటోలు, వీడియోలు లేదంటే ఆడియో క్లిప్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలని ఇద్దరు మహిళా రెజ్లర్లకు చెప్పారు. వాటిని ఆధారాలతో సహా ఇస్తేనే కేసు బలంగా ఉంటుందని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే ఓ రిపోర్ట్ కూడా తయారు చేశారు ఢిల్లీ పోలీసులు. బ్రిజ్ భూషణ్ చాలా సార్లు బలవంతంగా హగ్‌ చేసుకున్నాడని రెజ్లర్లు ఆరోపించారు. దీనికీ ఎవిడెన్స్ ఉందా అని ప్రశ్నించారు. ఈ ఏడాది ఏప్రిలే 21వ తేదీన ఇద్దరు మహిళా రెజ్లర్లు తమ స్టేట్‌మెంట్ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. CRPC సెక్షన్ 91 కింద ఈ రెజ్లర్లకు నోటీసులిచ్చారు పోలీసులు. "ఆరోపణలకు సంబంధించి ఏ సాక్ష్యం ఉన్న కచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే" అని తేల్చి చెప్పారు. బ్రిజ్ భూషణ్ బెదిరింపు కాల్స్ కూడా చేశారన్న ఆరోపణలకూ ఆధారాలు అడిగారు. ఫోటోలు, కాల్‌ రికార్డింగ్‌లు, వాట్సాప్‌ చాట్‌లు ఏమైనా ఉంటే ఆ వివరాలు ఇవ్వాలని తెలిపారు. 


Also Read: G20తో భారత్ సామర్థ్యమేంటో ప్రపంచానికి తెలిసింది, ఏడాది పాటు వేడుకలు - మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ