RSS Chief Mohan Bhagwat Comments On Mamata Govt: వెస్ట్‌ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారుకు వ్యతిరేకంగా కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు ఎటువంటి కఠిన చర్యలకు ఉపక్రమించిన తాము మద్దతుగా నిలుస్తామని అర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భగవత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోలకతాలో జరిగిన రతింద్ర మంచా ఇంటరాక్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రపతి పాలనపై అభిప్రాయాన్ని కోరగా.. బంగాల్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా తమ మద్దతు ఉంటుందన్నారు.


ఆర్‌జీకర్ ఆస్పత్రి రేప్‌ మర్డర్‌ చర్య పట్ల దేశం యావత్‌ దిగ్భ్రాంతికి గురైంది.. ఈ తరుణంలో వెస్ట్ బెంగాల్‌లో ప్రెసిడెంట్ రూల్‌ పెట్టడమే సరైన చర్యగా భగవత్ తెలిపారు. అయితే ఆ ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సింది కేంద్రమేనని చెప్పారు. ఆర్‌జీకర్ ఆస్పత్రి ఘటనపై నిరసన తెలిపిన ఆయన.. ఈ దుశ్చర్య వెనుక ఎవరున్నా వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని అన్నారు. సీతను అపహరిస్తే రామాయణకి దారి తీసిందని.. ద్రౌపది కొంగు పట్టి లాగితే మహాభారతం జరిగిందన్న భగవత్‌.. మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కావడం బాధాకరమన్నారు.


ఆర్జీకర్ ఆస్పత్రి ఘటన జరిగి వారాలు గడుస్తున్నా దానిపై దేశ ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయడంలో ఇప్పటికీ మమత సర్కారు విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. కళాశాల ప్రిన్సిపల్‌ను మార్చడం సహా ఘటన జరిగిన ప్రదేశంలో గోడలు పగులగొట్టి సాక్ష్యాధారాలు ధ్వంసం చేసే కుట్ర జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.


Also Read: హైవేలపై టోల్‌ ఛార్జ్‌ మినహాయింపు పొందాలంటే ఏం చేయాలి? ఇంతకీ ఏంటీ GNSS?


పిల్లలకు సంస్కారం నేర్పాలి


పిల్లలకు ముఖ్యంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మళ్లీ సంస్కారపు విలువలను తిరిగి బోధించాల్సిన సమయం ఆసన్నమైందని భగవత్ చెప్పారు. మహిళల పట్ల దోరణి మారాలని పేర్కొన్నారు. పిల్లలు ఫోన్లలో, అడ్వర్టైజ్‌మెంట్లలో సోషల్‌ మీడియాలో డిజిటల్ ప్లాట్‌ఫాంలలో ఏం చూస్తున్నారు ఎలా బిహేవ్‌ చేస్తున్నారన్న దాని గురించి తల్లిదండ్రులు అవగాహనతో ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ సూచించారు. సమాజం మొత్తం ఈ రుగ్మత నుంచి బయట పడాల్సి ఉందన్నారు.


మణిపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ సహాయక చర్యలు


 హింసాత్మకంగా మారిన మణిపూర్‌లో RSS కార్యకర్తలు తమ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రజల మధ్య విద్వేష వాతావరణం తగ్గించి సహోదర భావం పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భారత్‌లో అంతర్భాగం అన్న స్పృహను దేశం విస్తరించేలా ఆర్‌ఎస్‌ఎస్‌ చర్యలు కొనసాగుతున్నాయన్నారు.


భారత అభివృద్ధి యాత్రకు కొందరు అవరోధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న మోహన్ భగవత్‌.. వారి ప్రయత్నాలు ఫలించబోవన్నారు. ఛత్రపతి శివాజి పోరాటం చేసిన కాలంలో ఎదురైన పరిస్థితులు నేడు ఎదురుకాబోవని అన్నారు. ధర్మమే అందరిని రక్షిస్తుందని అన్నారు. ఇదే సమయంలో ధర్మం అంటే కేవలం పూజ మాత్రమే కాదని.. సత్యశోధన, అంత:కరణ శుద్ధి, డెడికేషన్‌ అని భగవత్‌ చెప్పారు. హిందూ పదానికి అర్థమే భిన్నత్వంలో ఏకత్వమని.. వసుదైక కుటుంబకం హిందూత్వ విధామని ఆయన అన్నారు. జీవన శక్తి అన్నది భారతీయుల జీవనానికి ఆధారమని.. అది హిందూత్వ మూలాలలోనే ఉన్నదని పేర్కొన్నారు. భారత్‌ శక్తిసంపన్న దేశమని అనారు.  


Also Read: మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం- హింస కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు