Manipur Erupts Again: కొన్ని వారాలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్‌లో గత వారం రోజులుగా మళ్లీ హింస చెలరేగింది. కొన్ని నెలల క్రితం కుకీ, మొయితీ తెగల మధ్య జరిగిన ఘర్షణలో 200 మంది వరకు మృత్యువాత పడగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు దిగాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి మణిపూర్‌లో ఐదు రోజుల పాటు మొబైల్‌ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్, వీపీఎన్‌  సేవలు నిలుపులద చేస్తూ  చర్యలు తీసుకున్నారు. ఇంటర్నెట్‌ను ఉపయోగించుకొని సంఘ విద్రోహశక్తులు అసత్యాలను ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు రేగేలా చేస్తున్నాయని.. అందుకే ఇంటర్నెట్‌ నిలుపుదల చేస్తున్నట్లు మణిపూర్‌ సర్కార్ తెలిపింది.


వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్‌ మీడియాల ద్వారా విద్రోహశక్తులు ప్రజలను రెచ్చగొట్టి.. ప్రజల మానప్రాణాలు, వారి ఆస్తులపై దాడులకు తెగబడే ప్రమాదం ఉందని .. ఈ చర్యల ద్వారా కట్టడి చేయొచ్చని అధికారులు వివరించారు. ఇంఫాల్‌ లోయ పరిధిలోని రెండు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూని ప్రకటించింది. అయితే ఈ కర్ఫ్యూని కూడా లెక్క చేయని కొందరు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. గత వారం జరిగిన డ్రోన్ బాంబు అటాక్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.ఒక దశలో బలగాలు టియర్‌ గ్యాస్‌ను గాల్లోకి కాల్పులను జరిపి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది.


ఆ తర్వాత గవర్నర్‌ను కలిసి తమ 6 డిమాండ్లు పరిష్కరించాల్సిందిగా కోరారు. పరిష్కారానికి కృషి చేస్తానని తమతో గవర్నర్ చెప్పినట్లు విద్యార్థులు పేర్కొన్నారు.  పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని భావించిన మణిపూర్‌ సర్కార్ అన్ని హైయర్ ఎడ్యుకేషన్ కళాశాలలను సెప్టెంబర్ 12 వరకు మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మణిపూర్ యూనివర్శిటీ ఇప్పటికే అన్ని రకాల ఎగ్జామ్స్‌ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.


కేంద్రం కూడా మణిపూర్‌కు మరో రెండు బెటాలియన్ల సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను ఎయిర్‌ లిఫ్ట్ ద్వారా తరలించింది. తద్వారా మణిపూర్‌లో అదనంగా మరో 2 వేల మంది బలగాలను చేర్చింది. సైన్యం, అస్సాం రైఫిల్స్‌ ఇంకా ఇతర భద్రతా బలగాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఆపరేషన్లు చేపట్టి ఆయుధాలను స్వాధీనం చేసున్నారు.


Also Read: హైవేలపై టోల్‌ ఛార్జ్‌ మినహాయింపు పొందాలంటే ఏం చేయాలి? ఇంతకీ ఏంటీ GNSS?


గతేడాది మే నుంచి కుకీలకు మొయితీలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మొయితీలు తమను షెడ్యూల్డ్ ట్రైబ్స్‌గా ప్రభుత్వం గుర్తిస్తూ ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేస్తుండగా.. కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొయితీల దగ్గరే అధికారం మొత్తం ఉందని కుకీల భద్రతకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కుకీ తెగ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో 16 నెలలుగా మణిపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొని ఉండగా.. కొద్ది నెలలుగా పరిస్థితి అదుపులో ఉంది. ఐతే గత వారం డ్రోన్ బాంబు దాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ దాడికి పాల్పడిన వాళ్లు కుకీలుగా మొయితీలు ఆరోపిస్తున్నారు. ఆ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.


Also Read: రాహుల్ గాంధీకి పెళ్లంట - మరోసారి ఊగిపోతున్న సోషల్ మీడియా ! వధువు ఎవరో తెలుసా ?


ఘటనకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలకు రిపోర్టు ఇచ్చినట్లు మణిపూర్‌ పోలీసులు తెలిపారు. ఈ పరిస్థితి వెనుక చైనా కుట్ర ఉన్నట్లు సెంట్రల్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. కేంద్రం పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.