Vande Bharat Trains News in Telugu: దేశంలో వందే భారత్ ట్రైన్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రతి రాష్ట్రం తమకు వందేభారత్ ట్రైన్స్ కావాలని కేంద్రం ముందు డిమాండ్లు ఉంచుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55 సర్వీస్ లు అందుబాటులో ఉండగా.. త్వరలో నాలుగు వందేభారత్ లు అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికున్న డిమాండ్ ని బట్టి కోచ్ ల సంఖ్యను పెంచారు. ఇప్పుడు వందే భారత్ కొత్త సిరీస్ 20 కోచ్ ల తో రాబోతోంది. 


20కి పెరగనున్న కోచ్‌ల సంఖ్య


ఇప్పటి వరకు ఉన్న వందేభారత్ ట్రైన్స్ కి 8 లేదా 16 కోచ్ లు ఉంటున్నాయి. వీటి సంఖ్య ఇప్పుడు 20కి పెంచుతున్నారు. కోచ్ ల సంఖ్య పెరిగితే ప్రజలకు మరింత చేరువ కావొచ్చని, మరింతమంది ప్రయాణించే వీలుంటుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. వందే భారత్ స్టాండర్డ్ వెర్షన్ 16 కోచ్ లతో ఉంటుంది. ఐదేళ్ల క్రితం వందేభారత్ మొదలైంది కూడా ఈ 16 కోచ్ లతోటే. ఆ తర్వాత వందేభారత్ మినీ అంటూ 8 కోచ్ ల ట్రైన్ ని ప్రవేశ పెట్టారు. ఇప్పుడు కోచ్ ల సంఖ్య 20కి పెంచుతూ కొత్త సిరీస్ ని లాంఛ్ చేస్తున్నారు. ఒకేసారి నాలుగు రైళ్లను ప్రారంభించబోతున్నారు. అందులో ఒకటి తెలంగాణ నుంచి నడుస్తుంది. సికింద్రాబాద్‌–నాగ్‌పూర్‌ ఆరెంజ్‌ వందేభారత్‌ 20 కోచ్ లతో పట్టాలపై పరుగులు తీయడానికి సిద్ధంగా ఉంది. ఈనెల 16న దీన్ని ప్రారంభిస్తారు. 


చెన్నైలోని ఇంటిగ్రెల్‌ కోచ్‌ ఫ్యా క్టరీలో వందే భారత్ ట్రైన్లు తయారవుతున్నాయి. 20కోచ్ లతో నాలుగు కొత్త రైళ్లు తయారు కాగా వాటిలో రెండింటిని ఉత్తర రైల్వే జోన్ కు ఇచ్చారు. తూర్పు రైల్వే జోన్ కు ఒకటి, సెంట్రల్‌ రైల్వే జోన్‌ కు మరొకటి కేటాయించారు. హైదరాబాద్‌ -నాగ్‌పూర్‌ మధ్య ప్రారంభించాల్సిన కొత్త రైలుని గతంలోనే మంజూరు చేశారు. 


అదనంగా మరో 312 సీట్లు 
ప్రస్తుతం 8 కోచ్‌ లు ఉండే వందే భారత్‌ రైలులో 530 సీట్లు ఉంటాయి. 16 కోచ్‌ల ట్రైన్ లో 1,128 సీట్లు అందుబాటులో ఉంటాయి. కొత్తగా ప్రవేశపెట్టబోతున్న 20 కోచ్‌ల ట్రైన్ లో అదనంగా మరో 312 సీట్లు ఉంటాయి. అంటే మొత్తం రైలులో ఉన్న సీట్ల సంఖ్య 1,440 అనమాట. దేశవ్యాప్తంగా వందే భారత్ ట్రైన్లకు మంచి గిరాకీ ఉంది. ఈ ట్రైన్ లో వెళ్తే సమయానికి గమ్యస్థానం చేరుకుంటామనే నమ్మకం ప్రయాణికుల్లో ఉంది. చార్జీ ఎక్కువే అయినా సౌకర్యాల పరంగా బాగుంటుంది కాబట్టి అందరూ దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే ఆక్యుపెన్సీ రేషియో గరిష్టంగా 130 శాతానికి పెరిగింది. గిరాకీ పెరుగుతోంది కాబట్టే కోచ్ ల సంఖ్యను 20కి పెంచి కొత్త ట్రైన్లు తీసుకొస్తోంది రైల్వే శాఖ. 20 కోచ్‌ ల ఉంటే కొత్త సిరీస్ వందేభారత్‌ లో 3 ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ లు ఉంటాయి. 17 ఎకానమీ కోచ్ లు ఉంటాయి. ఇవి ఏసీ చైర్‌కార్‌ లు. 


తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 కొత్త వందేభారత్ లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని ఈనెల 16న వర్చువల్ గా ప్రారంభిస్తారు. అహ్మదాబాద్‌ నుంచి ప్రధాని మోదీ వీటిని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇందులో ఒకటి  హైదరాబాద్‌ నుంచి నాగ్‌ పూర్‌ మధ్య నడుస్తుంది. మరో ట్రైన్ విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌ ఘఢ్‌ లోని దుర్గ్‌ వరకు వెళ్తుంది. ఈ కొత్త ట్రైన్లు ఎక్కువ కోచ్ లతో వస్తున్నాయి. వీటి సక్సెస్ రేటు ఎలా ఉంటుందో, ఆక్యుపెన్సీ రేషియో ఎలా ఉంటుందో చూడాలి. 


Also Read: Well of Death: ప్రాణాలు పణంగా పెట్టి సాహసం, ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు మహిళ విన్యాసాలు