Soma Basu Brave stuntwomen performs at Well of Death | ఎగ్జిబిషన్‌లు, జాతరల్లో బైకులు, కార్లతో రైడర్లు గిరగిరా తిరుగుతూ సాహస ప్రదర్శనలు చేసి, ప్రజలను సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తుంటారు. వీరు చేసే సాహసాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఎటువంటి భద్రతా చర్యలు లేకుండా వీరు ప్రదర్శించే స్టంట్లలో ఒక్క చిన్న పొరపాటు జరిగినా ప్రాణాపాయం ఉంటుంది.


Well of Death: మరణ బావి అంటే ఏమిటి?


మరణ బావి అనేది పెద్ద వృత్తాకారంలో ఉండే సాహస ప్రదర్శనా స్థలం. ఇందులో స్టంట్ రైడర్లు వాహనాలతో గిరగిరా తిరుగుతూ వీక్షకులను ఆకట్టుకుంటారు. చిన్న తప్పిదం కూడా ప్రాణహానికి దారితీస్తుంది. అందుకే వీరి ప్రదర్శనలను "మరణ బావి" అని పిలుస్తారు.


పశ్చిమ బెంగాల్‌కు చెందిన సోమా బసు, గత 20 ఏళ్లుగా ఈ ప్రదర్శనలు చేస్తూ స్టంట్ రైడింగ్‌లో మాస్టర్‌గా గుర్తింపు పొందారు. సోమా బసు పశ్చిమ బెంగాల్‌ లోని మోయీరా అనే గ్రామంలో జన్మించారు. ఆమెకు 4 ఏళ్ల వయసులోనే తన తండ్రి మరణించారు. చిన్నప్పటి నుంచీ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ, సోమా తన తల్లితో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించారు.


ఒకానొక సందర్భంలో సోమా తన గ్రామంలో జరిగిన ఎగ్జిబిషన్‌కి వెళ్ళి, అక్కడ స్టంట్ రైడర్లు చేస్తున్న ప్రదర్శన చూసారు. ఆ ప్రదర్శన ఆమెను ఎంతో ప్రభావితం చేసింది. "నాకు ఆ రోజు నుంచి ఈ సాహస ప్రదర్శనలు చేసేందుకు ఏదో బలమైన ఆకర్షణ కలిగింది," అని ఆమె అన్నారు. తన జీవితాన్ని సాహసంగా గడపాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంతో కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్ వంటి అనేక చోట్ల స్టంట్ రైడర్లతో కలిసి ఆమె ప్రయాణించారు. స్టంట్ రైడింగ్‌లో పట్టు సాధించారు. "మా అమ్మ మొదట్లో నేను చేసే ప్రదర్శనలను వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు నా ధైర్యాన్ని చూసి నాపై గర్విస్తున్నారు," అని సోమా అన్నారు.


మరణ బావిలోకి తొలి అడుగు:


అప్పట్లో ఒక మహిళగా మరణ బావిలో సాహసాలు చేయడం ఆమెకు సవాలుగా మారింది. సాహస ప్రదర్శనల్లో ఎక్కువగా పురుషులు ఉంటారు కాబట్టి, ఆమె ప్రారంభంలో అనేక అవమానాలు భరించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. "మహిళగా ఉండటం వల్ల నా ప్రతిభను తక్కువ అంచనా వేసేవారు. కానీ నా పట్టుదలతో వారిని తప్పు అని నిరూపించాను," అని సోమా అన్నారు.


మరణ బావిలో సాహసాలు:


మరణ బావిలో ప్రదర్శనలు చేయడం అత్యంత ప్రమాదకరం. గోడల వెంట వాహనాలు గిరగిరా తిరుగుతుంటాయి. ఇది చాలా అప్రమత్తంగా చేయాలి. "ప్రతి సారి బైక్‌పై కూర్చుని మరణ బావి లో తిరుగుతున్నప్పుడు ప్రాణాలు ముందే ఉంటాయి. ఆ సమయంలో భయం ఉంటుంది, కానీ సాహసం మా జీవనోపాధి కాబట్టి ఆ భయాన్ని అధిగమించగలుగుతున్నాం," అని సోమా అన్నారు.


సోమా బసు ప్రదర్శన బృందంలో ఆరుగురు బైక్ రైడర్లు, మూడు కార్ డ్రైవర్లు ఉంటారు. "ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రదర్శనలు ఇస్తారు. గోడలకు ఆనుకుని తిరగడం అంటే కేవలం సాహసమే కాదు, అది ఒక కళ. వాహనాలను సమర్థవంతంగా నియంత్రించడం, వేగాన్ని కంట్రోల్ చేస్తూ స్టంట్స్ చేయడం మా ప్రధాన లక్ష్యం. కొన్ని సార్లు పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఆ సమయంలో మాకు ఎలాంటి సహాయం ఉండదు. వైద్య ఖర్చులు, ఫిట్నెస్, రికవరీ అన్నీ మేమే చూసుకోవాలి," అని సోమా తెలిపారు.


"ప్రతి ప్రదర్శన మాకు ఒక ఫైనల్ పరీక్ష లాంటిది. సోమా అక్క మా అందరికీ ఆదర్శం. ఆమె ధైర్యం, పట్టుదల మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది," అని అనీష్ అనే రైడర్ అన్నారు.


ప్రేక్షకుల నుండి వచ్చే కీరింతలే మాకు స్ఫూర్తి:


"ప్రేక్షకుల కీరింతలే మాకు స్ఫూర్తి. వారి శభాష్‌లు, చప్పట్లు మాకు మరింత ఉత్సాహం కలిగిస్తాయి" అని సోమా అన్నారు.


భవిష్యత్తు లక్ష్యాలు:


సోమా బసు భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు చేయాలనుకుంటున్నారు. "నేను మా బృందంతో మరిన్ని సాంకేతికతలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో సాహస ప్రదర్శనలు చేయడం మా లక్ష్యం," అని సోమా అన్నారు.


Also Read: Viral News: యువతితో దురుసుగా వ్యవహరించిన ఆటో డ్రైవర్‌కు అనూహ్య మద్దతు, ఎందుకంటే!