కొన్నిసార్లు చేసింది తప్పా ఒప్పా అనేది చూసేదే లేదు.. మనోడైతే చాలు ఎంతవరకైనా వెళ్దాం అనుకునే వాళ్లకు ఈ దేశంలో కొదువే లేదని మరోసారి నిరూపించారు.. మన సహచర భారతీయులు. గత వారం ఓలా ఆటో ఎక్కిన ఓ యువతి పట్ల రూడ్‌గా బిహేవ్ చేసిన బెంగళూరు ఆటో డ్రైవర్‌కు మద్దతుగా కొందరు నిలవడమే ఈ తరహా దోరణికి నిలువెత్తు సాక్ష్యం. గత వారం బెంగళూరు మగది రోడ్‌లో ఓ కాలేజీ యువతి ఓలా ఆటోను బుక్‌ చేసుకుంది. ఐతే ఆ ఆటో వచ్చేలోపే తాను మరో ఆటో బుక్‌ చేసుకోవడంపై మండి పడ్డ ఆటో డ్రైవర్‌ 46 ఏళ్ల ముత్తురాజ్‌.. ఆ యువతి చెంపమీద కొట్టడం సహా ఫోన్ లాక్కొని నానా యాగి చేశాడు.  ఈ ఘఠనపై సదరు యువతి పోలీసులను ఆశ్రయించగా.. వారు ఆటో డ్రైవర్ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి అతడ్ని కటకటాల వెనక్కి పంపారు. అంతే కాకుండా ఈ తరహా డ్రైవర్లు అందరిని గుర్తించి 152 కేసుల వరకూ బుక్ చేశారు.


జైల్లో ఉన్న ముదిరాజ్ కోసం కొందరు క్రౌడ్‌ ఫండింగ్‌:






                    ప్రస్తుతం జైలులో ఉన్న ముదిరాజ్‌ కోర్టు ఖర్చులు లాయర్‌ ఫీజులకు దాదాపు ౩౦ వేల వరకూ ఖర్చు కానుంది. ఈ మొత్తాన్ని సమకూర్చేందుకు X వేదికగా కొందరు క్రౌడ్‌ ఫండింగ్‌కు పూనుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించే ఇలాంటి వ్యక్తికి అండగా నిలవడంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నప్పటికీ కన్నడిగ పేరిట కొందరు మాత్రం తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌ చేసిన మోహన్ దాసరి అనే వ్యక్తి.. ఫ్రస్ట్రేషన్‌లోనే ముత్తురాజ్‌ ఇలా చేశాడని.. అందుకు 4 రోజులు జైలులో గడిపాడని పేర్కొన్నాడు. అతనికి ఆదాయం కూడా తగ్గిందని.. లీగల్‌ ఫీజులకు అయ్యే ౩౦ వేలు చెల్లించలేడని ఆ ట్వీట్‌లో చెప్పాడు. ఈ తరుణంలో ఏ లాయర్‌ అయినా ముత్తురాజ్‌ తరపున వాదనకు వస్తే తన వంతుగా వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇతరులు కూడా తనతో కలసి రావాలని మోహన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన కొందరు.. కన్నడిగుల కోసం తన వంతుగా వెయ్యి రూపాయలు ఇస్తామని కామెంట్లు చేస్తున్నారు. మరో మద్దతుదారుడు తాను కూడా వెయ్యి రూపాయలు ఇస్తానని సదరు ఆటో డ్రైవర్‌కు న్యాయం జరగాలంటూ పోస్టు చేశాడు. అయితే మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఆ ఆటోడ్రైవర్‌కు మద్దతు తెలుపుతూ కొందరు పోస్టులు పెట్టడాన్ని మరికొందరు నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కన్నడ వారియర్స్ పేరిట ఇలా చేయడం తగదని సిద్ అనే మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.


ఆ యువతి ఘటన వెలుగులోకి రావడంతో మరి కొందరు మహిళలు కూడా ముత్తురాజ్‌ వ్యవహారశైలిపై పోలీసులను కలిసి తాము ఎదుర్కొన్న ఘటనలను వివరించారు. తమ ఫోన్ లాక్కోవడం, చేయి చేసుకోవడం వంటి ఘటనలకు పాల్పడ్డట్లు తెలిపారు.