Sobhita Dhulipala's Love Sitara Releasing Directly In To OTT: ఈ మ‌ధ్యకాలంలో ఓటీటీ ల‌వ‌ర్స్ పెరిగిపోయారు. ఓటీటీలో వ‌చ్చిన ఏ సినిమానూ వ‌దిలే ప్ర‌స‌క్తే లేదన్న‌ట్లుగా చూసేస్తున్నారు. దీంతో ఆ అద‌ర‌ణ చూసిన ఓటీటీ సంస్థ‌లు కొత్త కొత్త, మంచి సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాయి. జీ 5 కూడా మంచి మంచి సినిమాల‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వస్తోంది. దాంట్లో భాగంగా నాగ చైత‌న్య‌కు కాబోయే భార్య శోభితా ధూళిపాళ న‌టించిన 'ల‌వ్ సితార‌'ను రిలీజ్ చేయ‌నుంది జీ 5. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. మ‌రి స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి ఉంటుంది.


'జీ 5లో లవ్ సితార' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?


'ల‌వ్ సితార' చిత్రం సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ కానుంది. జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా. ఈ విష‌యాన్ని జీ 5 అధికారికంగా ప్ర‌క‌టించింది. సినిమాకు సంబంధించి ఒక చ‌క్క‌టి పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేసింది. దాంట్లో సంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపించారు శోభిత‌. గోల్డ్ రంగు చీర‌ను క‌ట్టుకొని, చ‌క్క‌గా న‌వ్వుతూ కనిపించారు ఆమె. ఆ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. 


ఈ సినిమా రొమాంటిక్ ఎమోష‌న‌ల్  జోన‌ర్ లో తెరకెక్కినట్లు తెలుస్తోంది. “లవ్, హార్ట్ బ్రేక్, సెల్ఫ్ డిస్కవరీ” అంటూ సినిమా కాన్సెప్ట్ గురించి హింట్ ఇచ్చారు పోస్ట‌ర్ ద్వారా. దీంతో ఒక ఇండిపెండెంట్ ఉమెన్  గురించి ఈ సినిమా అయ్యి ఉంటుంది అని అంచ‌నా వేస్తున్నారు. 'ల‌వ్ సితార' చిత్రానికి వందన్ కటారియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శోభితాతో పాటు రాజీవ్‍, శంకర్ ఇంద్ర ఛూడన్, రిజుల్ రే, సీమా సాన్వీ కూడా కీలకపాత్రలు పోషించారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 






నాలుగేళ్ల క్రితం మొదలైన షూటింగ్...


'ల‌వ్ సితార' సినిమా రిలీజ్ అయ్యేందుకు దాదాపు నాలుగేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. ఈ సినిమా షూటింగ్ 2020లో ప్రారంభించిన‌ప్ప‌టికీ 2024లో రిలీజ్ చేస్తున్నారు. క‌రోనా, కొన్ని టెక్నిక‌ల్ ఇష్యూస్, ఇత‌ర కార‌ణాల‌తో షూటింగ్ లేట్ అయ్యింది. 'ల‌వ్ సితార' చిత్రాన్ని త‌క్కువ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. ఈ సినిమాను ఆర్ఎస్‍వీపీ పతాకంపై రోనీ స్క్రీవాలా నిర్మించారు. ల‌వ్, బ్రేక‌ప్, కామెడీ అన్ని సినిమాలో ఉంటాయ‌ని మేక‌ర్స్ గ‌తంలో హింట్ ఇచ్చారు. చూడాలి మ‌రి సినిమా ఎలా ఉండ‌బోతుందో?.  అయితే, శోభిత‌కి ఓటీటీ సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలో కూడా ఆమె చాలా వెబ్ సిరీస్ ల‌లో న‌టించారు. 2019లో విడుదలయిన ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే వెబ్ సిరీస్... శోభితకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత ఆమె తెలుగు, హిందీ, తమిళ, మలయాళం లో కూడా న‌టించారు.



 శోభిత ధూళిపాళ, నాగ‌చైత‌న్య త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు ఆగ‌స్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి మాత్రం వ‌చ్చే ఏడాది ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. శోభిత‌, నాగ‌చైత‌న్య ఇద్ద‌రు త‌మ త‌మ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న కార‌ణంగా వివాహం నిదానంగా జ‌రిపించాల‌నే ఉద్దేశంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది.


Also Read: అమెరికాలో కేథరిన్ పుట్టినరోజు వేడుకలు... అదీ తెలుగు సినిమా సెట్స్‌లో, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరంటే?