Tamil Nadu Latest news: తమిళనాడులో మరోసారి శపథ రాజకీయాలు మొదలయ్యాయి. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శపథం చేశారు. డీఎంను పదవి నుంచి దించే వరకు తాను చెప్పులు కానీ,షూ కానీ వేసుకోనని ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు.  


మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడిన అన్నామలై.... "డీఎంకేను అధికారం నుంచి దించే వరకు చెప్పులు వేసుకోను. నేనే కొరడాతో ఆరు దెబ్బలు కొట్టుకుంటాను . శుక్రవారం నేను కోయంబత్తూరులోని నా ఇంటి ముందు కొరడాలతో కొట్టుకుంటాను. ఈ దుష్ట పాలనలో జీవించడాన్ని నిరసిస్తాను. రేపు ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభిస్తాను. 48 రోజుల పాటు ఈ ఉపవాస దీక్ష కొనసాగుతుంది." అన్నారు.   


అన్నా యూనివర్శిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై అన్నామలై ప్రెస్‌మీట్ పెట్టారు. 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి వివరాలు ఉన్న ఎఫ్‌ఐఆర్‌ లీక్ అవ్వడంపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్ర పోలీసులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బాధితురాలే భయపడేలా పోలీసులు ఎఫ్ఐఆర్ రాయడాన్ని ఖండించారు.


అన్నామలై ఇంకా ఏమన్నారంటే..."ప్రశ్నలు అడగడమే మా పని. సమధానాలు చెప్పడం ప్రభుత్వ కర్తవ్యం. అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో సీసీ కెమెరాలు లేవని చెప్పడానికి మీకు సిగ్గు లేదా? చేయి విరగడం, కాలు విరగడం శిక్షా? నిజమైన ప్రభుత్వమైతే 15 శిక్షలు వేసి ఉండాల్సింది." అని మండిపడ్డారు. 


"శిక్షను 10 రోజుల్లో అమలు చేయవచ్చు. ఆ తల్లి అబద్ధం చెప్పిందా? మీరు మంచి పని చేసారా? మనపై మనమే జాలిపడి మురుగ భగవానుని క్షమించమని అడుగుదాం. నిర్భయ ఫండ్ ఇచ్చాం. అదంతా ఎక్కడికి పోయింది? అన్నా యూనివర్సిటీలో సీసీటీవీ లేకపోవడం సరికాదు. ఎఫ్‌ఐఆర్ చదివితే ఇలా జరిగిందా అనే అనుమానం ఆ అమ్మాయికే వస్తుంది." అని అన్నారు. 


రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని డిఎంకె ప్రభుత్వంపై ఆరోపించారు అన్నామలై. మీడియా ఎదురుగానే తాను బూట్లు తీసేసి డిఎంకె ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు బూట్లు ధరించబోనని చెప్పారు.


"డిఎంకె ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు నేను చెప్పులు లేకుండా నడుస్తాను. దయచేసి ఇవన్నీ పరిశీలించాలని నేను ప్రజలను అభ్యర్థిస్తున్నాను"అని ఆయన అన్నారు: "ఎప్పటిలాగే, ఎన్నికల్లో గెలవడానికి డబ్బు ఇవ్వడం లేదు. డబ్బులు పంచకుండా ఎన్నికల్లో పోరాడతాం. డీఎంకే ప్రభుత్వం గద్దె దిగే వరకు చెప్పులు ధరించను."


అన్ని చెడులు తొలగిపోవాలని శుక్రవారం కోయంబత్తూరులోని తన నివాసం బయట ఆరుసార్లు కొరడాతో కొట్టుకుంటానని అన్నామలై అన్నారు. తమిళనాడులోని మురుగన్ ఆరు పవిత్ర క్షేత్రాలకు వెళ్లడానికి తాను 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.


అన్నా యూనివర్శిటీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జ్ఞానశేఖరన్ గతంలో కూడా నేరాలు చేశాడని అన్నామలై ఆరోపించారు. డీఎంకే నేతలతో ఉన్న కారణంగా పోలీసుల ఆయనపై రౌడీ షీట్ తెరవలేదని విమర్శించారు. 37 ఏళ్ల జ్ఞానశేఖరన్‌ డీఎంకే నేతలతో కలిసి ఉన్న ఫొటోలు, కరపత్రాలు చూపించారు. 


ఇలాంటి వాటిపై చర్చించడం మానేసి ప్రజలకు సంబంధం లేని విషయాలపై చర్చిస్తున్నారని మండిపడ్డారు అన్నామలై. ఉత్తర-దక్షిణ రాజకీయాలు అంటూ ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి డిఎంకె ప్రయత్నించిందన్నారు. ఇలాంటి రాజకీయాలతో తాను అలసిపోయాను అన్నారు.