Attack On MIM Chief Asaduddin Owaisi House: హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి (Asaduddin Owaisi) సంబంధించి ఢిల్లీలోని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి దాడికి పాల్పడ్డారు. అశోక్ రోడ్డులోని ఆయన ఇంటిపై దాడి చేసిన దుండగులు.. అక్కడి గేట్, నేమ్ ప్లేట్‌పై నల్ల ఇంకు పూశారు. ఆయనపేరు కనిపించకుండా చేశారు. అలాగే, భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అనే నినాదాలతో ఉన్న పోస్టర్లను కూడా అతికించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నేమ్ ప్లేట్‌పై ఇంక్ తుడిచేశారు. అక్కడి పోస్టర్లను తొలిగించారు. అనంతరం ఒవైసీ ఇంటి ముందు పహారా కాశారు. కాగా, ఇటీవల పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా కొన్ని నినాదాలు చేయడంతో వివాదాస్పదంగా మారింది. బీజేపీ శ్రేణులు ఆయన తీరును తప్పుబట్టారు.
తీవ్రంగా స్పందించిన ఒవైసీ
మరోవైపు, ఈ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలోని తన నివాసంపై పదే పదే దాడులు చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు తాను భయపడేది లేదని.. తన నివాసాన్ని ఎన్నిసార్లు టార్గెట్ చేశారో లెక్కే లేదని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. ఎంపీల భద్రతపై ఏం హామీ ఇస్తారో చెప్పాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కోరారు. ఈ తరహా దాడులు తనను భయపెట్టలేవని.. ఇలాంటి పిరికిపంద చర్యలను ఆపాలని దాడులు చేసే వారిని హెచ్చరించారు. రాళ్లు విసరడం, ఇంక్ వేయడం వంటివి మాని.. తమను నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.
గతంలోనూ దాడులు
కాగా, గతంలోనూ హైదరాబాద్ ఎంపీ ఒవైసీ నివాసంపై దాడులు జరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో ఆయన నివాసంపై దుండగులు రాళ్ల దాడి చేశారు. దీంతో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. గత ఆగస్టులోనూ ఢిల్లీలోని నివాసంపై దాడి జరిగింది. అయితే, పార్లమెంట్‌లో ఏదైనా ముఖ్యమైన అంశంపై మాట్లాడితే.. తన ఇంటిపై దాడి చేయడం అలవాటుగా మారిందని ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, ఒవైసీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని పలువురు రాష్ట్రపతికి లేఖ రాశారు. మరోవైపు, ఈ అంశంపై ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
Also Read: IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?