Sanatan Dharma Row: 


సనాతన ధర్మం వివాదం..


సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు ఖండిస్తూనే ఉన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడడమేంటని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రులూ ఇప్పటికే ఈ వివాదంపై స్పందించారు. గట్టిగానే బదులిచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయనిధి స్టాలిన్‌పై మండి పడ్డారు. ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బ తీయను అని రాజ్యాంగం సాక్షిగా చెప్పిన విషయం మర్చిపోయారా అని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. 


"మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగం సాక్షిగా ఓ మాట చెప్తాం. ఎవరి మనోభావాలనూ దెబ్బ తీయనని హామీ ఇస్తాం. అయినా మీరు మాత్రం సనాతన ధర్మం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బ తీశారు. బహుశా ఇది మీ పార్టీ సిద్ధాంతం కావచ్చు. అయినా సరే...మీకు ఇలా మాట్లాడే హక్కు లేదు. మతాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎవరూ ఇవ్వలేదు"


- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి


హింసకు తావు లేదు..


ఉదయనిధి స్టాలిన్‌ తలను తీసుకొచ్చిన వారికి రూ.10 కోట్లు ఇస్తానంటూ ఓ స్వామీజీ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు నిర్మలా సీతారామన్. దేశంలో ఇలాంటి హింసకు తావులేదని తేల్చి చెప్పారు. చేతల్లోనే కాదు...మాటల్తో ఇలా బెదిరింపులకు పాల్పడినా కట్టడి చేయాల్సిన అవసరముందని అన్నారు. అయితే...ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని దేవాదాయ మంత్రి శేఖర్ బాబు ఖండించకపోవడం వివాదానికి దారి తీసింది. DMK పార్టీ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినప్పటికీ...హిందువులను దూరం పెట్టలేదని, గౌరవమిస్తుందని అన్నారు. దీనిపై కొందరు బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. వెంటనే ఆ పదవి నుంచి ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మలా సీతారామన్ మాత్రం ఉదయనిధికి గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు. వేరే మతం గురించి ఇలా మాట్లాడే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. 


"వేరే మతాల గురించి ఇలా మాట్లాడే ధైర్యం వాళ్లకు లేదు. చూద్దాం వేరే మతాల గురించి కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తారేమో. మిగతా మతాల్లోనూ లోపాలు లేవా..? ఆ మతాల్లోనూ మహిళల పట్ల వివక్ష కనిపిస్తోందిగా. ఆ మతాల గురించి మాట్లాడే దమ్ము మీకుందా..?"


- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి


ఇప్పటికే నిర్మలా సీతారామన్ సనాతన ధర్మం వివాదంపై స్పందించారు. డీఎమ్‌కే, I.N.D.I.A కూటమి హిందువులకు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని విమర్శించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్‌పైనా మండి పడ్డారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించినా..విమర్శలు మాత్రం ఆగడం లేదు. కూటమిలోనే కొన్ని పార్టీలు ఉదయనిధి చేసిన కామెంట్స్‌ని వ్యతిరేకించాయని అన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకించడం తప్ప DMKకి ఓ అజెండా ఏమీ లేదని అన్నారు. తమిళనాడు ప్రజలు ఆ పార్టీ పాలనతో విసిగిపోయారని, కేవలం భాషాపరమైన అడ్డంకుల కారణంగానే దేశ ప్రజలకు అది అర్థం కావడం లేదని వెల్లడించారు. 


Also Read: రిజర్వేషన్ అస్త్రాలతో బీజేపీపై యుద్ధం, కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?