ఢిల్లీలో జరగబోతున్న జీ-20 సదస్సు కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఇండియా చేరుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. G-20 భారతదేశానికి బాగా కలిసొచ్చే విషయం అని.. సరైన సమయంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోందని అన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు.


బ్రిటన్‌లోని ఖలిస్తాన్‌కు సంబంధించిన ఓ ప్రశ్నపై ప్రశ్నపై మాట్లాడుతూ.. హింసను, మతోన్మాదాన్ని తాను సహించబోనని అన్నారు. ‘‘ఇది చాలా ముఖ్యమైన సమస్య. బ్రిటన్‌లో మతోన్మాదం లేదా హింస ఏ రూపంలో ఉన్నా సహించబోమని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మేం ఈ సమస్యపై భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. ముఖ్యంగా PKE (ప్రో ఖలిస్తాన్ తీవ్రవాదం) సమస్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం’’ అని అన్నారు


రిషి సునాక్ ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఇటీవల మా భద్రతా మంత్రి భారతదేశాన్ని సందర్శించారు. ఆయన దాని గురించి నాతో మాట్లాడారు. మేం కొన్ని వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసాం. వారు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా, మనం ఈ రకమైన హింసాత్మక మతోన్మాదాన్ని అధిగమించగలం. బ్రిటన్‌లో ఇలాంటి హింసను, మతోన్మాద చర్యలను సహించబోమన్నది ఖాయం’’ అని అన్నారు.


ఉక్రెయిన్‌పై దాడి తప్పు - సునాక్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించినంతవరకు, నేను కచ్చితంగా ఒక విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను. రష్యా చేసిన ఈ యుద్ధం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. ఇటీవల, రష్యా గ్లోబల్ గ్రెయిన్ డీల్ నుండి వైదొలిగింది. దీంతో ప్రపంచంలో ఆహార ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగాయి. అంతా మీకు తెలుసు. దీంతో లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఉక్రెయిన్‌పై దాడి చేయడం ద్వారా రష్యా పెద్ద తప్పు చేసిందని నేను అంటున్నాను. ఈ యుద్ధం వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను.


భారత్ తటస్థ వైఖరిపై స్పందన
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఇప్పటి వరకు తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది కదా అని అడిగిన ప్రశ్నకు ప్రధాని సునాక్ ఇలా అన్నారు. ‘‘అంతర్జాతీయ వ్యవహారాలపై భారతదేశ వైఖరి ఏంటో నేను చెప్పలేను. అయితే, భారతదేశం అంతర్జాతీయ చట్టాన్ని గౌరవిస్తుందని కూడా నాకు తెలుసు’’ అని అన్నారు. వాణిజ్య ఒప్పందంపై అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే సమాధానం ఇచ్చారు.


వాణిజ్య ఒప్పందంపై స్పందన ఇలా
భారత్‌, బ్రిటన్‌ల మధ్య చాలా కాలంగా వాణిజ్య ఒప్పందం సమస్య నలుగుతోంది. దాదాపు రెండేళ్లుగా సాగుతున్న చర్చలు ఇప్పటి వరకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. దీని గురించి అడిగిన ప్రశ్నకు, సునాక్ మాట్లాడుతూ.. ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయడంలో నేను, మోదీ ఇద్దరం పర్టిక్యులర్ గా ఉన్నాం. ఈ విషయంలో అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఇలాంటి ట్రేడ్ డీల్స్‌కు సమయం పడుతుందేమో చూడాలి. దీని వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం కలుగుతుంది. అయితే, మేం ఈ విషయంలో చాలా పురోగతి సాధించాం. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి’’ అని అన్నారు. ప్రధాని మోదీపై సునాక్ మాట్లాడుతూ.. ‘‘మోదీ జీ అంటే నాకు చాలా గౌరవం, ఆయన కూడా నాకు వ్యక్తిగతంగా సహాయం చేస్తున్నారు. ఇద్దరం చాలా కష్టపడుతున్నాం. నేను ఈ ఫోరమ్ వంటి వేదికలపై మోదీ జీకి మద్దతు ఇస్తున్నాను ఎందుకంటే ఇది భారతదేశానికి పెద్ద విజయం’’ అని రిషి సునాక్ అన్నారు. 


హిందువుగా గర్విస్తున్నా
‘‘హిందువుగా నేను గర్విస్తున్నా. నేను హిందువుగానే పెరిగాను. అలాగే ఉన్నాను. ఆలయాలకు వెళ్తాను. ఇటీవలే రాఖీ పండుగ చేసుకున్నాం. భారత్‌కు రావడం పర్సనల్ గా నాకెంతో ప్రత్యేకమైన విషయం. నా పూర్వీకులకు చెందిన భారత్‌ అంటే నాకు ఎంతో ఇష్టం’’ అని రిషి సునాక్ అన్నారు. దేశంలో సనాతన ధర్మం నిర్మూలించాలని తమిళనాడు మంత్రి చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగుతున్న వేళ రిషి సునాక్ ఇలా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.