అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ల్యాండ్ అయింది. ఆయనకు సాంప్రదాయ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ బైడెన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత జో బైడెన్‌ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో బైడెన్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌తో పాటుగా సీక్రెట్ సర్వీస్ అధికారులు, ఇతర వైట్ హౌస్ ఉన్నతాధికారులు ఉన్నారు. 


ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి బయటికి వచ్చిన బైడెన్ అభివాదం చేశారు. బైడెన్ తన అధికారిక ‘బీస్ట్’ వాహనం ఎక్కి ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి జో బైడెన్‌ నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అక్కడే బైడెన్‌కు డిన్నర్ ఉండనుంది. ఇరుదేశాల ప్రయోజనాలపై ఇద్దరు నేతలు చర్చించుకోనున్నారు.