Ajit Pawar:
ఆకస్మిక భేటీ..
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారిపోయి రెండు వారాలు దాటింది. అజిత్ పవార్ NCP నుంచి బయటకు వచ్చి శిందే ప్రభుత్వంలో చేరిపోయారు. ఆయనతో పాటు దాదాపు 8 మంది నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అజిత్ పవార్ డిప్యుటీ సీఎం అయ్యారు. అప్పటి నుంచి NCP పార్టీ పేరు, గుర్తుపై అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అజిత్ పవార్ ఉన్నట్టుండి శరద్ పవార్ ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు. చాలా సేపు ఆయనతో మాట్లాడి ఆశీర్వాదం తీసుకుని మరీ వచ్చారు. వైబీ చవన్ సెంటర్‌లో శరద్ పవార్ ఉన్నారన్న సమాచారం అందుకున్న వెంటనే అజిత్ పవార్ ఆయన దగ్గరకు వెళ్లారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తిన తరవాత ఇలా ప్రత్యేకంగా భేటీ అవ్వడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
"దేవుడి లాంటి శరద్ పవార్ వద్ద ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. ఆయన ఇక్కడ ఉన్నారని మాకు సమాచారం అందింది. ఆయనను కలుసుకోడానికి ఇదే మంచి అవకాశం అనుకున్నాం. వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నాం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా ఉండాలని మేం కోరాం. కానీ శరద్ పవార్ దీనిపై స్పందించలేదు"
- ప్రఫుల్ పటేల్, ఎన్‌సీపీ సీనియర్ నేత
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సరిగ్గా ఒక రోజు ముందు అజిత్ పవార్...శరద్ పవార్‌ని కలవడం చర్చకు దారి తీసింది. దాదాపు గంట పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. పార్టీ అధ్యక్ష పగ్గాలను శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ లాగేసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) తిరుగుబాటు వర్గం శరద్ పవార్ త పార్టీ జాతీయ అధ్యక్షుడు కాదని, అజిత్ పవార్ తమ అధినేత అని పేర్కొంది. ఈ మేరకు ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తు తమకు చెందుతాయని ఈసీకి రాసిన లేఖలో అజిత్ పవార్ ప్రస్తావించారు. 35 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, అజిత్ పవార్ ను ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా గుర్తించాలని ఈసీని కోరారు.53 మంది NCP ఎమ్మెల్యేలలో 40 మంది మద్దతు తమకే ఉందని అజిత్ పవార్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన తరవాత సీన్ మారిపోయింది. గవర్నర్‌కి ఇచ్చిన లేఖలో మాత్రం తనకు 40 మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.
Also Read: హనుమంతుడికి మించిన గొప్ప రాయబారి ఎవరూ లేరు, మోదీ ప్రధాని అవడం ఈ దేశం అదృష్టం - జైశంకర్