Twitter Loses Case:
అకౌంట్స్ బ్లాక్ చేయాలన్న కేంద్రం...
కర్ణాటక హైకోర్టు ట్విటర్ వేసిన ఓ పిటిషన్‌ని కొట్టేసింది. కొన్ని అకౌంట్స్‌ని, ట్వీట్‌లను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ ట్విటర్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే...కేంద్ర ఆదేశాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ పిటిషన్‌ని కొట్టేసిన కోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. "మా వాదనను కోర్టు సమర్థించింది. ట్విటర్ ఇక్కడి రూల్స్‌ని పాటించాల్సిందే" అని స్పష్టం చేశారు. గతేడాది ఐటీ యాక్ట్‌లో సంస్కరణలు చేసిన కేంద్రం...Section 69A ప్రకారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఫిబ్రవరి 2021 నుంచి 2022 ఫిబ్రవరి మధ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవాస్తవాలు ప్రచారం చేసిన అకౌంట్‌లు, ట్వీట్‌లను బ్లాక్ చేయాలని ట్విటర్‌ని ఆదేశించింది. దాదాపు 39 లిస్ట్ చేసి వాటిని బ్లాక్ చేయాలని తేల్చి చెప్పింది. దీనిపై ట్విటర్ అసహనం వ్యక్తం చేసింది. ఇది తమ రూల్స్‌కి వ్యతిరేకమని వెల్లడించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేసింది. న్యాయపోరాటానికి సిద్ధమైంది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం తమపై ఆంక్షలు విధించడాన్ని ట్విటర్ వ్యతిరేకించింది.
ఏడాదిగా పోరాటం..
గతేడాది కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. "బ్లాక్ చేయాలని చెబుతున్నారు సరే..వాటికి కారణాలూ చెప్పాలిగా" అని ట్విటర్ వాదించింది. అయితే...కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రూల్స్‌కి కట్టుబడి ఉండకుండా ట్విటర్ నిబంధనలు ఉల్లంఘిస్తోందని కోర్టుకి వివరించింది. ఈ ఆర్డర్ పాస్ చేసే ముందు ట్విటర్ ప్రతినిధులతో మాట్లాడమని వెల్లడించింది. ట్విటర్ ఉద్దేశపూర్వకంగానే కేంద్ర నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది.
ఉద్యోగుల అసహనం..
బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ట్విటర్‌పై ఉద్యోగులంతా చాలా అసహనంతో ఉన్నారు. హామీ ఇచ్చి వదిలేశారని మండి పడుతున్నారు. అంతే కాదు. కొందరు ఉద్యోగులు గ్రూప్‌గా ఏర్పడి ట్విటర్‌పై లీగల్ యాక్షన్ తీసుకునేందుకూ సిద్ధమయ్యారు. 2022 ఏడాది బోనస్‌లు ఇవ్వడంలో కంపెనీ విఫలమైందని ఇప్పటికే ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశారు. ట్విటర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగాల్..తమకు బోనస్ ఇస్తామని మాటిచ్చారని..కానీ ఒక్క పైసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ట్విటర్‌లో ఏటా బోనస్‌లు ఇస్తారు. అయితే...ఎలన్ మస్క్ గతేడాది అక్టోబర్‌లో ట్విటర్‌ని హస్తగతం చేసుకున్నారు. అప్పుడే పాలసీల్లో చాలా మార్పులు వచ్చాయి. ఫలితంగా..ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు బోనస్ కూడా వేయకపోవడం వల్ల వాళ్లంతా న్యాయ పోరాటానికి దిగారు.
Also Read: మెట్రోలోనూ మందు బాటిళ్లు తీసుకెళ్లచ్చు, మనిషికి రెండు మాత్రమే