Infant Baby: సోషల్ మీడియాలో చిన్న పిల్లల వీడియోలకు చాలా క్రేజ్ ఉంటుంది. వాళ్లు చేసే అల్లరి పనులు, ముద్దు ముద్దుగా పలికే పదాలు, వారి క్యూట్‌నెస్, వారి చిలిపి పనులు అన్నీ చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. చిన్నారుల వీడియోలు సోషల్ మీడియాలో చాలానే కనిపిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. మామూలుగా చిన్నారులు ఎప్పుడూ చేతులు పిడికిలి పట్టుకుని ఉంటారు. శిశువుల నుంచి కొన్ని నెలల వయస్సు వచ్చేంత వరకు వాళ్లు చేతులు ముడుచుకుని ఉంటారు. పెద్ద వాళ్లు వారి వేళ్లను చిన్నారుల పిడికితో పట్టుకునేలా చేసి తెగ ఆనంద పడిపోతుంటారు. అలాగే వాళ్లు ఎంత బలంగా పట్టుకుంటారో కూడా తెలిసే ఉంటుంది. కొన్ని సార్లు వాళ్ళకు తెలియకుండానే కొన్ని వస్తువులను, దుప్పట్లను, తల్లుల జుట్టు గట్టిగా పట్టుకోవడం తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు అనుభవమే. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ శిశువు కూడా అలాగే తన పిడికిలితో డాక్టర్ గ్లౌవ్‌ను గట్టిగా పట్టేసాడు. ఎంతకీ వదల్లేదు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఎంటర్‌టైన్ చేస్తోంది.
వికాస్ కుమార్ అనే డాక్టర్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియో పోస్టు చేశాడు. 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ శిశువు కనిపిస్తుంది. చూస్తుంటే రోజులు కూడా నిండని ఆ పసిబిడ్డను పరీక్షించేందుకు డాక్టర్ తన వద్దకు వెళ్లాడు. తనను పరీక్షించేందుకు వచ్చిన డాక్టర్ చేతిని ఆ శిశువు గట్టిగా పట్టేసుకున్నాడు. ఎడమ చేతి చూపుడు వేలి గ్లోవ్స్ ను గట్టిగా పట్టుకుని ఎంతకీ వదల్లేదు. డాక్టర్ విడిపించుకోవడానికి ప్రయత్నించినా అస్సలే వదల్లేదు. గ్లోవ్స్ సాగుతూ వచ్చింది తప్పితే ఆ శిశువు మాత్రం డాక్టర్ ను వదిలే ప్రసక్తే లేదు, నన్ను వదిలేసి వెళ్లిపోతా అనుకుంటున్నావా డాక్టర్ అంకుల్, ఇక్కడే ఉండు అన్నట్లుగా అలాగే గట్టిగా పట్టేసుకున్నాడు. ఈ వీడియోను పోస్టు చేసిన డాక్టర్ వికాస్ కుమార్.. అరే యార్ అకేలే మత్ ఛోడో ముజే (హే మ్యాన్.. నన్ను ఒంటరిగా వదిలి పెట్టి వెళ్లకు) అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ శిశువు డాక్టర్ ను పట్టుకున్న విధానంపై నవ్వు తెప్పించే కామెంట్లు పెడుతున్నారు. ఈ 24 సెకన్ల వీడియోను డాక్టర్ వికాస్ కుమార్ జూన్ 29 వ తేదీన మధ్యాహ్నం 3.15 గంటలకు పోస్టు చేయగా.. అంతలోనే వైరల్ గా మారింది.
https://twitter.com/drvknarayan/status/1674353462967164928?s=20
ఈ వీడియోను చూసిన నెటిజన్ ఒకరు ఆ శిశువును బాహుబలితో పోల్చారు. 'నాకు బాహుబలి సీన్ గుర్తుకు వచ్చింది. ఆ చిన్నారి చేతుల్లో అంత బలం ఉంది' అంటూ కామెంట్ పెట్టారు.
'నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. నాకు కొడుకు పుట్టిన ఒక రోజు తర్వాత అతడిని NICUలో ఉంచారు. అప్పుడు వాడు ఆక్సిమీటర్ ను వదలకుండా గట్టిగా ఇలాగే పట్టుకున్నాడు' అని ఓ యూజర్ తన మధుర జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.