Manipur Violence: 


రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు..


మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బైరెన్ సింగ్ రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో హింసాత్మక వాతావరణాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని రోజులుగా అల్లర్లు జరుగుతున్నా...పరిస్థితులు అదుపులోకి తీసుకురాలేకపోయారు బైరెన్ సింగ్. అధిష్ఠానం కూడా దీనిపై అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన గవర్నర్‌ని కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన రాజీనామా చేస్తారన్న వార్త వినిపిస్తోంది. అయితే...ఆయన ఇంటి వద్దకు వందలాది మంది మహిళలు చేరుకున్నారు. రాజీనామా చేయొద్దంటూ నినదించారు. జనాల తాకిడి పెరుగుతుండటం వల్ల మరోసారి ఇంఫాల్‌లో కర్ఫ్యూ విధించారు. బైరెన్ సింగ్ మద్దతుదారులు కూడా ఇంటి వద్ద భారీగా చేరుకున్నారు. ఆయన గవర్నర్‌తో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ...వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన రాజీనామా లేఖనీ చించేశారు. ఈ చించేసిన రిజిగ్నేషన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తరవాత స్వయంగా బైరెన్ సింగ్ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో తాను రాజీనామా చేయాలని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.  










 


ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలతో బీజేపీ శ్రేణులు అలెర్ట్ అయ్యాయి. ఆయన రాజీనామాను హైకమాండ్ అంగీకరించదని తేల్చి చెబుతున్నాయి. ఇంకా ఆయనపై నమ్మకం ఉందని,మరో అవకాశమిచ్చి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు సహకరిస్తారని స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలే అమెరికా, ఈజిప్ట్‌ పర్యటనలు ముగించుకుని వచ్చిన ప్రధాని మోదీకి కేంద్రహోం మంత్రి అమిత్‌షా మణిపూర్ స్థితిగతుల్ని వివరించారు. బైరెన్‌ సింగ్‌కి మరో అవకాశమివ్వాలని మోదీ భావిస్తున్నట్టు సమాచారం. అటు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ రాష్ట్రం ఇలా మండిపోడానికి బైరెన్ సింగే కారణమని ఆరోపిస్తున్నాయి. ఆయన కచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాయి. అయినా..బైరెన్ సింగ్‌పై విశ్వాసం ఉంచింది కేంద్రం. ఇప్పటి వరకూ ఈ అల్లర్లలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఆల్‌పార్టీ మీటింగ్.. 


మణిపూర్ అల్లర్లపై చర్చించేందుకు కేంద్రహోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఆల్‌ పార్టీ మీటింగ్‌కి (All Party Meeting) పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి NCP చీఫ్ శరద్ పవార్ హాజరు కాలేదు. అయితే...ఆ పార్టీ తరపున జనరల్ సెక్రటరీ నరేంద్ర వర్మ, మణిపూర్ ఎన్‌సీపీ చీఫ్ సోరన్ ఇబోయమా సింగ్‌ పాల్గొన్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, మేఘాలయా ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా, ఆప్‌ లీడ్ సంజయ్ సింగ్ ఈ మీటింగ్‌కి వచ్చారు. ఇప్పటికీ మణిపూర్‌లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. వరుసగా దాడులు చేస్తున్నారు ఆందోళనకారులు. మంత్రి సుసింద్రోకి చెందిన ఓ ప్రైవేట్ గోడౌన్‌కి నిప్పంటించారు. ఫలితంగా ఇంఫాల్‌లో పరిస్థితులు అదుపు తప్పాయి. మరో మంత్రి ప్రాపర్టీకి కూడా నిప్పంటించేందుకు ప్రయత్నించారు. మే 3వ తేదీ నుంచి ఇక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో ఓ సారి అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించారు. అక్కడి పరిస్థితులు సమీక్షించారు. ఆ రెండ్రోజులు కాస్త సద్దుమణిగినా ఆ తరవాత మళ్లీ మొదటికే వచ్చింది. ఈ అల్లర్లపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇన్ని రోజులుగా రాష్ట్రం తగలబడిపోతుంటే ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ మండి పడుతున్నాయి. ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశం పెట్టారని, ఈ భేటీ ప్రధానికి ఏమాత్రం ముఖ్యం కాదని స్పష్టమైందని రాహుల్ గాంధీ విమర్శించారు. 


Also Read: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి, అదే మా లక్ష్యం- ప్రధాని మోదీ