Tamilnadu Governor vs CM:



ఆర్ఎన్ రవి వర్సెస్ స్టాలిన్ సర్కార్ 


తమిళనాడులో మంత్రి వి సెంథిల్ బాలాజీ ( V Senthil Balaji)ని పదవి నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్ RN రవి (RN Ravi) తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కించింది. గవర్నర్ కేవలం రబ్బర్ స్టాంప్ అంటూ DMK నేతలు మండి పడుతున్నారు. ఈ క్రమంలోనే అసలు గవర్నర్‌కి మంత్రిని తొలగించే అధికారం ఉందా అన్న డిబేట్ జరుగుతోంది. అటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం "గవర్నర్‌కి అసలు చట్టం గురించే తెలియదు. న్యాయపోరాటం చేస్తాం" అని తేల్చి చెప్పారు. ఆ తరవాత RN రవి తన నిర్ణయంపై వెనక్కి తగ్గారు. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్నాక తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఓ లేఖ విడుదల చేశారు. అయితే..రాజ్యాంగ పరంగా గవర్నర్‌కి ఎలాంటి హక్కులుంటాయి..? దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది..? అసలు అడ్మినిస్ట్రేషన్‌లో గవర్నర్ రోల్ ఏంటి..అన్నవి కీలకంగా మారాయి. 


మంత్రిని తొలగించొచ్చా..?


రాజ్యాంగంలోని Article 164(1) ముఖ్యమంత్రులు, మంత్రుల నియామకం గురించి ప్రస్తావిస్తుంది. దీని ప్రకారం...రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. మిగతా మంత్రులను ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు నియమిస్తారు. ఈ అధికారం కూడా గవర్నర్‌కే ఉంటుంది. అయితే...ముఖ్యమంత్రి సలహాల మేరకు గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని గద్దె దించే అధికారం గవర్నర్‌కి ఉన్నప్పటికీ ఓ కండీషన్ ఉంది. ఆ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయినా, గద్దె దిగేందుకు మొండికేసినా అప్పుడు గవర్నర్‌ రంగంలోకి దిగుతారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. అంతే తప్ప మంత్రులను నేరుగా తొలగించే అధికారం ఆయనకు ఉండదు. అది కూడా ముఖ్యమంత్రి సిఫార్సు లేకుండానే చేయడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అని వాదిస్తున్నారు DMK నేతలు. లీగల్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్న దాని ప్రకారం చూస్తే..


"రాష్ట్రంలో ప్రభుత్వం అదుపు తప్పినా, మైనార్టీలో పడిపోయినా వెంటనే రద్దు చేయాలని గవర్నర్ రాష్ట్రపతికి సిఫార్సు చేయొచ్చు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలా వద్దా అనేది రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది. కానీ...కేబినెట్‌లోని మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కి ఉండదు. ముఖ్యమంత్రి సూచనల మేరకే ఆయన నడుచుకోవాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం"


సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?


పంజాబ్‌లో గవర్నర్ షంషేర్ సింగ్, ప్రభుత్వానికి మధ్య ఇలాంటి విభేదాలే తలెత్తాయి. అప్పట్లో సుప్రీంకోర్టు దీనిపై విచారించేందుకు 7గురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనకు సమాంతరంగా గవర్నర్ మరో విధంగా పరిపాలించాలనుకోడం కుదరదని తేల్చి చెప్పింది. అంతకు ముందు కూడా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు "మంత్రి మండలి సూచనల మేరకే గవర్నర్ నడుచుకోవాలి" అని స్పష్టం చేసింది. అంటే...ఎలా చూసినా ఓ మంత్రిని బర్తరఫ్ చేసే అధికారం గవర్నర్‌కి లేదు. అందుకే తమిళనాడు ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తామంటూ తేల్చి చెప్పింది. ఈ రాష్ట్రంలోనే కాదు. బీజేపీ ప్రభుత్వేతర రాష్ట్రాల్లో గవర్నర్‌కి, ప్రభుత్వానికి మధ్య పొసగడం లేదు. తెలంగాణలోనూ ఇదే జరుగుతోంది. 


Also Read: వెనక్కి తగ్గిన తమిళనాడు గవర్నర్- సెంథిల్ బాలాజీ పదవి బర్త్‌రఫ్‌ ఉత్తర్వులు నిలుపుదల