Delhi University:
శతాబ్ది వేడుకలు..
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యూనివర్సిటీ వరకూ మెట్రోలోనే ప్రయాణించిన మోదీ...ప్రయాణికులతో ముచ్చటించారు. ఆ తరవాత వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన మోదీ...దేశ పురోగతికి విద్యాసంస్థలే ప్రతీకలు అని వెల్లడించారు. ఢిల్లీ యూనివర్సిటీ కేవలం యూనివర్సిటీ మాత్రమే కాదని, ఎంతో మందికి జీవితాలను అందించిందని కొనియాడారు. ఎన్నో ఉద్యమాలకూ ఈ యూనివర్సిటీ ఊపిరి పోసిందని అన్నారు. గతంలో ఢిల్లీ యూనివర్సిటీ కింద కేవలం 3 కాలేజీలు మాత్రమే ఉండేవని ఇప్పుడా సంఖ్య 90కి చేరుకుందని గుర్తు చేశారు. ఇదే సమయంలో భారత దేశం ఆర్థికంగానూ పురోగతి సాధిస్తోందని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా దేశంలో IIT,IIM, NIT ల సంఖ్య పెరిగిందని తెలిపారు.
"భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైంది. సరిగ్గా ఇదే ఏడాది ఢిల్లీ యూనివర్సిటీ 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఇది కేవలం ఓ యూనివర్సిటీ కాదు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. కొన్నేళ్ల క్రితం ఈ యూనివర్సిటీ కింద కేవలం మూడు కాలేజీలు ఉండేవి. ఇప్పుడు 90కిపైగా ఉన్నాయి. ఒకప్పుడు భారత దేశం సరైన ఆర్థిక వ్యవస్థ లేని దేశాల జాబితాలో ఉండేది. ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఢిల్లీ యూనివర్సిటీలో అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్యే పెరుగుతోంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
ఇదే ప్రసంగంలో మరి కొన్ని కీలక విషయాలు ప్రస్తావించారు ప్రధాని మోదీ. 2047 నాటికి భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యం అని తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కి గౌరవం పెరుగుతోందని అన్నారు.
"2047 నాటికి భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలి. అదే మా లక్ష్యం. అమెరికా పర్యటనకు గతంలోనూ వెళ్లాను. కానీ వెళ్లిన ప్రతిసారీ నాకో విషయం అర్థమైంది. భారత్ పట్ల అక్కడి వాళ్లకు గౌరవం పెరుగుతోంది. ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. లింగనిష్పత్తిలోనూ గణనీయ మార్పు సాధించాం. డ్రోన్ పాలసీలోనూ మెరుగయ్యాం. ఒకప్పుడు స్వాతంత్య్రం కోసం పోరాటం చేశాం. ఇప్పుడు శాంతియుత మార్గంలో దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. భారీ యూనివర్సిటీలు, కాలేజ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. వాటికి అంతర్జాతీయంగా గుర్తింపు కూడా లభిస్తోంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: Uniform Civil Code: యూసీసీపై స్పీడ్ పెంచిన కేంద్రం, వర్షాకాల సమావేశాల్లోనే తుది నిర్ణయం!