TTD Chairman YV Subba Reddy: భువనేశ్వర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Odisha CM Naveen Patnaik)ను ఆహ్వానించారు. శనివారం సాయంత్రం టీటీడీ చైర్మన్ ఒడిశా సీఎంను ఆయన అధికారిక నివాసంలో కలిసి శ్రీవారి ప్రసాదాలు, ఆహ్వాన పత్రిక అందజేసి శాలువతో సన్మానించారు.


మే 21 నుంచి మహా సంప్రోక్షణ..
మే  21 వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని సుబ్బారెడ్డి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కి తెలియజేశారు. 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని చైర్మన్ వివరించారు. కార్యక్రమానికి హాజరవుతానని నవీన్ పట్నాయక్ తెలియజేశారు. ఒడిశా సీఎంను కలిసిన సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి కొవిడ్19 నిబంధనలు పాటించారు. ముఖానికి మాస్క్ ధరించి కనిపించారు.


అంతకుముందు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భువనేశ్వర్ లో ఆలయ నిర్మాణ పనులు, మహాసంప్రోక్షణకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కళ్యాణ మండపంలోని గదులకు ఏసీ సదుపాయం కల్పించాలని భక్తులు చైర్మన్ ను కోరారు. వెంటనే ఈ ఏర్పాటు చేయాలని చైర్మన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవకులతో అక్కడి వసతులు, ఇతర అంశాలపై మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు,  విజిఓ మనోహర్, భువనేశ్వర్ స్థానిక సలహామండలి చైర్మన్  దుశ్యంత్ కుమార్, సభ్యులు పాల్గొన్నారు.