Wayanad Tiger Attack : ఓ మహిళపై దాడి చేసి, చంపిన పులిని వెంటనే చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఈ రోజు తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆ పులి చనిపోయి కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ పులి ఎలా చనిపోయిందన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. కానీపై పులి శరీరంపై అక్కడక్కడా గాయాలున్నట్టు మాత్రం తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జనవరి 26న ప్రకటించిన ఈ నిర్ణయం ప్రకారం, కర్ఫ్యూ డివిజన్ 1 (పంచరకొల్లి), డివిజన్ 2 (పిలకావు), డివిజన్ 36 (చిరక్కర) లకు వర్తిస్తుంది. ఇది జనవరి 27 అంటే ఈ రోజు ఉ.6 గంటల నుంచి ప్రారంభమై 48 గంటల పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ డివిజన్లలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, మదర్సాలు, ఇతర సంస్థలు మూతపడతాయి. ఈ ప్రాంతాల నుంచి ఇతర విద్యా సంస్థలకు హాజరయ్యే విద్యార్థులకు జనవరి 27, 28 తేదీలలో తరగతులకు హాజరయ్యేందుకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. విద్యాసంస్థల్లో ఏమైనా పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటే వారు తప్పనిసరిగా తమ డివిజన్ కౌన్సిలర్‌ను సంప్రదించి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

మహిళపై దాడి చేసి, దారుణంగా చంపిన పులి

వయనాడ్ లోని మనంతవాడి సమీపంలోని ప్రియదర్శిని ఎస్టేట్‌లో కాఫీ తోటలో పని చేస్తోన్న రాధ అనే మహిళపై ఓ పెద్దపులి దాడి చేసి, ఆమె శరీరంలోని కొంత భాగాన్ని కూడా తినేసినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న జయసూర్య అనే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్‌ఆర్‌టీ) మెంబర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పైనా ఆ పులి దాడి చేసింది. ఇలా ఆ పులి వరుస దాడులకు పాల్పడడంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ఈ విషయంపై ఆ రాష్ట్ర మంత్రి శశీంద్రన్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సీఎం సూచన మేరకు  అడ్వకేట్‌ జనరల్‌, ఇతర న్యాయ నిపుణులతో చర్చల అనంతరం ఆ పులిని చంపేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఓ పులిని మ్యాన్‌ - ఈటర్‌గా ప్రకటించడం కేరళ రాష్ట్రంలో ఇదే తొలిసారని మంత్రి శశీంద్రన్‌ చెప్పారు.

పులి దాడుల నివారణకు చర్యలు

ఇటీవలి కాలంలో పులి దాడులతో అప్రమత్తమైన కేరళ సర్కారు ఈ తరహా ప్రమాదాలను తగ్గించేందుకు, నివారించేందుకు చర్యలు చేపట్టింది. సమీప ప్రాంతాలలో పొదలను తొలగించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో నిఘా ముమ్మరం చేశారు. వన్యప్రాణుల నిర్వహణలో భాగంగా వయనాడ్‌లో 100 కొత్త కెమెరాలను ఏర్పాటు చేస్తామని, పర్యవేక్షణను పటిష్టం చేయడానికి, వన్యప్రాణులకు సంబంధించిన దాడులను నిరోధించడానికి మార్చి 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 400 AI కెమెరాలను ఏర్పాటు చేస్తామని మంత్రి శశీంద్రన్ ఈ సందర్భంగా తెలిపారు.

Also Read : Made In India Iphones: డ్రాగన్‌ తోకను వదిలేస్తున్న ఆపిల్‌ - పెరగనున్న 'మేడ్‌ ఇన్‌ ఇండియా ఐఫోన్‌'లు