Jai Shri Ram Chants in Stadium:
జైశ్రీరాం నినాదాలు..
అహ్మదాబాద్‌లో జరిగిన భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లో ఆడియెన్స్ కొందరు పాక్ ప్లేయర్‌ని పెవీలియన్‌కి వస్తుండగా జైశ్రీరామ్ అంటూ నినదించారు. మహమ్మద్ రిజ్వాన్ డ్రెసింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయేంత వరకూ అలాగే నినాదాలు చేశారు. మ్యాచ్ జరుగుతుండగా మధ్య మధ్యలోనూ జై శ్రీరాం నినాదాలు గట్టిగానే వినిపించాయి. ఇది పొలిటికల్ హీట్‌ని పుట్టించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు దీన్ని సపోర్ట్ చేశారు. ఇంకొందరు మాత్రం ఎందుకిదంతా అంటూ మండి పడుతున్నారు. నెటిజన్లతో పాటు కొందరు రాజకీయ నేతలూ ఈ వివాదంపై స్పందించారు. పాక్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ 49 పరుగుల వద్ద ఔట్ అయ్యి పెవీలియన్‌కి వచ్చినప్పుడు కొందరు ఈ నినాదాలు చేశారు. దీనిపై డీఎమ్‌కే నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సహించకూడదని తేల్చి చెప్పారు. ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
"భారత్ అంటేనే ఆతిథ్యానికి మారు పేరు. కానీ...నరేంద్ర మోదీ స్టేడియంలో పాక్ ప్లేయర్స్‌కి సరైనా ఆతిథ్యం దొరకలేదు. వాళ్లు వచ్చినప్పుడు ఇలా నినాదాలు చేయడం చాలా దురదృష్టకరం. క్రీడలు ఏవైనా దేశాలను కలిపేలా ఉండాలి. వీటిని కూడా విద్వేషాలు రెచ్చగొట్టే మాధ్యమంలా మార్చొద్దు"
- ఉదయనిధి స్టాలిన్,తమిళనాడు మంత్రి
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే కూడా దీనిపై స్పందించారు. 2036 నాటికి భారత్ ఒలింపిక్స్‌కి ఆతిథ్యం ఇవ్వాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని, కానీ ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అది సాధ్యమవుతుందా అన్నప్రశ్న తలెత్తుతోందని విమర్శించారు.
"2036 ఒలింపిక్స్‌కి భారత్ ఆతిథ్యం ఇవ్వాలని మోదీ కోరుకుంటున్నారు. కానీ..బీజేపీ తమ విధానాలతో ప్రజల్ని ఇలా తయారు చేసింది. పాకిస్థాన్ ప్లేయర్‌ని చూసి జైశ్రీరామ్ అని నినదించే స్థాయికి దిగజార్చింది. ఇదంతా చూస్తుంటే..భారత్‌లో అంతర్జాతీయ క్రీడలు జరుగుతాయా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇంకా విచిత్రం ఏంటంటే...నరేంద్ర మోదీ స్టేడియంలోనే అలాంటి దురదృష్టకర సంఘటన జరగడం"
- సాకేత్ గోఖల్, టీఎమ్‌సీ ఎంపీ
ఇక బీజేపీ నేతలు కొందరు ఈ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మోదీ స్టేడియం ఇలా జైశ్రీరాం నినాదాలతో మారు మోగిందంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. చాలా గర్వంగా ఉందని పోస్ట్‌లు పెడుతున్నారు.
Also Read: ఇండియాలో ఉండాలంటే భారత్ మాతాకీ జై అనాల్సిందే - కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు