Narayan Gangaram Surve House : మహరాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలోని ఓ ఇంటికి తాళం వేసి ఉంది. మంచి ఛాన్స్ అనుకున్న ఓ దొంగ ఇంట్లోకి చొరబడి చోరీ చేశాడు. అక్కడ ఉన్న కొన్ని వస్తువులు చూసి అది ప్రముఖ కవి ఇల్లు అని తెలుసుకొని షాక్ అయ్యాడు. అంతే చోరీ సొత్తు అక్కడే వదిలేసి క్షమించాలని ఓ లెటర్ పెట్టి పరారు అయ్యాడు.
మహారాష్ట్రలోని ప్రముఖ కవి నారాయణ్ సువే చనిపోయిన దాదాపు 15 ఏళ్లు అవుతున్నా ఆయన ప్రభావం ప్రజల్లో ఇంకా ఉండనే ఉంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. నారాయణ్ సువే ఇంట్లో కుమార్తె అల్లుడు ఉంటున్నారు. వాళ్లిద్దరూ వేరే ఊరికి పది రోజులు వెళ్లారు. ఇంతలో ఆ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. చాలా విలువైన వస్తువులన్నింటినీ మూట కట్టేశాడు. ఇంకా వస్తువుల కోసం వెతుకుతుంటే... నారాయణ్ సువే ఫొటోతోపాటు ఇతర వస్తువులు కనిపించాయి.
నారాయణ్ సువే ఫొటోను చూసి షాక్ తిన్న దొంగ తాను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. ఎంత తప్పు చేశానో తెలుసుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్న ఓ పేపర్ తీసుకొని లెటర్ రాశాడు. తాను ఎంతో తప్పు చేశానని... క్షమించాలంటూ నోట్ రాసి గోడకు అతికించాడు. తాను దొంగిలించేందుకు సిద్ధం చేసిన వస్తువులను కూడా అక్కడే పెట్టేసి వెళ్లిపోయాడు.
పది రోజుల తర్వాత తిరిగి వచ్చిన నారాయణ్ సువే కుమార్తె అల్లుడు వస్తువులు, గోడపై నోట్ చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. వేలి ముద్రలు ఆధారంగా దొంగను కనిపెట్టే పనిలో ఉన్నారు.
అనాథగా పెరిగిన నారాయణ్ సువే మరాఠీ ప్రజల్లో బలమైన ముద్ర వేశారు. చిన్న చిన్న పనులు చేసుకుంటేనే రెండో తరగతి వరకు చదివిన నారాయణ్ సువే మరాఠీ భాషలో అద్భుతమైన రచనలు చేశారు. ఆయన సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం కూడా నారాయణ్ సువే పద్మశ్రీతో సత్కరించింది.