Bureau Of Civil Aviation Key Propose On Fake Bomb Callers: ఇటీవల పలు విమానాలు, విమానయాన సంస్థలకు ఫేక్ బాంబు బెదిరింపులు తరచూ రావడం కలకలం రేపింది. ఈ క్రమంలో ప్రయాణికులు, విమానయాన సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అలాంటి నకిలీ కాల్స్ వల్ల ప్రయాణికులు, సిబ్బంది విలువైన సమయం వృథా కావడం సహా అంతా ఆందోళనకర పరిస్థితి తలెత్తుతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా 'ది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS)' కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమమైనట్లు తెలుస్తోంది. ఇలా నకిలీ కాల్స్ కేసుల్లో దోషులుగా తేలితే.. అలాంటి వారిని ఐదేళ్ల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాలని ఆలోచన చేస్తున్నట్లు బీసీఏఎస్ తెలిపింది. ఈ ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ముందు ఉంచనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నిబంధనల మేరకు అలా ఫేక్ కాల్స్ చేసిన వారిపై 3 నుంచి 6 నెలల నిషేధం మాత్రమే ఉంది. నిందితులు ఏ ఎయిర్ లైన్‌కు బెదిరింపులు చేశారో ఆ సంస్థ వరకూ మాత్రమే ఈ నిబంధన వర్తిస్తోంది. అయితే, దీన్ని అన్ని సంస్థల విమానాలకు వర్తింపచేయాలని బీసీఏఎస్ భావిస్తోంది.


41 విమానాశ్రయాలకు బెదిరింపులు


అయితే, మంగళవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో కొన్ని గంటల వరకూ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  ఒకే మెయిల్ ఐడీ నుంచి హైదరాబాద్ సహా అన్ని విమానాశ్రయాలకు మంగళవారం మధ్యాహ్నం మెయిల్స్ వచ్చాయి. దీంతో తనిఖీలు చేపట్టిన అధికారులు అవి ఫేక్ అని తేల్చారు. 'కేఎన్ఆర్' అనే ఆన్‌లైన్ గ్రూప్ ఈ బెదిరింపు మెయిల్స్ వెనుక ఉన్నట్లు అధికారులు అనుమానిస్తుండగా.. చెన్నై నుంచి ముంబయి వెళ్లే ఇండిగో విమానానికి కూడా ఇదే తరహా కాల్ వచ్చింది.


Also Read: Viral Video: విమానంలో విసనకర్రలు - ఉక్కపోతతో ప్రయాణికుల ఇబ్బందులు