Union Budget 2024: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కొత్త బడ్జెట్ (Union Budget 2024) ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా ఏడవ సారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. మోదీ 2.0 ప్రభుత్వంలో సీతారామన్ ఆర్థిక మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటివరకు ఐదు సార్లు పూర్తి స్థాయి బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ప్రధానిగా మోదీ కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు కేవలం బడ్జెట్‌కు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చిన నేపథ్యంలో సీతారామన్ ఈసారి పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  


పన్ను తగ్గిస్తే ఎవరికి లాభం
రాబోయే బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులు శుభవార్త వింటారని ప్రచారం ప్రముఖ వార్తా  సంస్థ రాయిటర్స్ కథనం ప్రచురించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు కొన్ని వర్గాలకు వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించవచ్చని పేర్కొంది. ఈ కథనం ప్రకారం సంవత్సరానికి రూ. 15 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారికి పన్ను మినహాయింపు దక్కుతుందని తెలుస్తోంది. 2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానంలో మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం సంవత్సరానికి రూ. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్లు 5 శాతం నుంచి 20 శాతం పన్ను చెల్లిస్తున్నారు. అలాగే రూ. 15 లక్షలు దాటిన సంపాదనపరులు 30 శాతం ట్యాక్స్‌ కట్టాల్సి వస్తోంది. ఈ రేట్లలో మార్పులు ఉండొచ్చని రాయిటర్స్‌ రాసింది. అదే జరిగితే ఆదాయపు పన్ను తగ్గించడం ద్వారా నగదు వినియోగం పెరుగుతుందని, అలాగే మధ్య తరగతి వారికి కూడా పొదుపు పెరుగుతుందని భావిస్తున్నారు. 


మధ్య తరగతి ప్రజలే లక్ష్యం
బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవడంతో కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకతను తగ్గించడానికి ఎన్డీఏ సర్కార్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మధ్య తరగతి ప్రజల పొదుపులను పెంచడంతో పాటు వారి జీవితాలను మెరుగుపరచడంపై తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పన్ను రేటు తగ్గింపుపై ఊహాగానాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందులో భాగంగానే పన్ను చెల్లింపుదారులు, మధ్య తరగతి ప్రజల కోసం ఆర్థిక మంత్రి సీతారామన్  2024 బడ్జెట్‌లో కొన్ని ఉపశమన చర్యలను ప్రకటిస్తారని ఎక్కువ శాతం ప్రజలు నమ్ముతున్నారు. 


దీనిపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కొత్త అధ్యక్షుడు సంజీవ్ పూరి ఇటీవల మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని 2024-25 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపును పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎటువంటి పన్ను రేట్లను తగ్గించలేదు. ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చిన నేపథ్యంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా కొత్త బడ్జెట్ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు పన్ను ఉపశమన చర్యలపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.