Jammu Kashmir Terrorist Attack: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి బరితెగించారు. ఓ సైనిక శిబిరంపై ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు భారత సైనికులు అక్కడికక్కడే వీర మరణం పొందారు. రాజౌరీకి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ కంపెనీ ఆపరేటింగ్ బేస్‌పై ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. ఇద్దరు టెర్రరిస్టులు ఆత్మాహుతికి పాల్పడినట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. మరో నాలుగు రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం ఉన్న వేళ ఈ ఘటన జరగడం చర్చనీయాంశం అయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






రాజౌరిలో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. అంతకుముందు, రాజౌరీలో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ కంపెనీ ఆపరేటింగ్ బేస్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు, దీనికి భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. ఉగ్రవాదులపై ఈ ఆపరేషన్ పూర్తయిందని భారత సైన్యం ప్రకటించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్‌లో భారత సైన్యానికి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందగా, ఐదుగురు జవాన్లు గాయపడినట్లు సమాచారం. సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.


రాజౌరీలోని దర్హాల్ ప్రాంతంలోని పర్గల్‌లోని ఆర్మీ క్యాంపులోకి ఎవరో ప్రవేశించేందుకు ప్రయత్నించారని, ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయని, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని గతంలో జమ్మూ ఏడీజీపీ తెలియజేశారు. ఉగ్రదాడిలో గాయపడిన సైనికుల్లో ఒకరిని చికిత్స నిమిత్తం తరలించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. 16 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.


ఒకరోజు ముందుగానే బుద్గామ్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. రాహుల్‌ భట్‌, అమ్రీన్‌ భట్‌ హత్యల్లో ఒక ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు తెలిసింది.


ఉరి దాడిని గుర్తు చేసేలా
ఈ రోజు (ఆగస్టు 11) రాజౌరిలో జరిగిన ఉగ్రదాడి ఉరీ దాడిని గుర్తుచేసేలా ఉంది. 18 సెప్టెంబర్ 2016న, జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాదులు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ సమీపంలోని భారత సైన్యం యొక్క స్థానిక ప్రధాన కార్యాలయంలోకి చొరబడి, శిబిరంలో నిద్రిస్తున్న భారత సైనికులపై దాడి చేశారు. నిద్రిస్తున్న భారత సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 17 హ్యాండ్ గ్రెనేడ్లను కూడా ప్రయోగించారు. ఈ ఉగ్రదాడిలో 16 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఆరు గంటల పాటు జరిగిన ఎన్‌ కౌంటర్‌లో భారత ఆర్మీ జవాన్లు నలుగురు జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాదులను హతమార్చారు. 10 రోజుల తర్వాత భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది.